logo

కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

కారును ఢీకొన్న ఘటనలో 11 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని రాయగిరి నుంచి మోత్కూర్‌ వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం చోటు

Published : 18 Jan 2022 02:40 IST

కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

చిన్నారి మృతి, ముగ్గురికి గాయాలు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కారును ఢీకొన్న ఘటనలో 11 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని రాయగిరి నుంచి మోత్కూర్‌ వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగసానిపల్లికి చెందిన గంగదేవి జాఫర్‌, లావణ్యల కూతురు అలేఖ్య(11)ను గ్రామం నుంచి సమీప బంధువులు (మేనత్త కుమారుడు బలరాం) చీమలకొండూరు గ్రామానికి కారులో తీసుకెళ్తుండగా చందుపట్ల శివారు గ్రామం కుమ్మరిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం ఇదే మార్గంలో వెళ్తూ ఢీకొట్టడంతో అలేఖ్య అక్కడిక్కడే మృతి చెందగా బలరాంతో పాటు మరో ఇద్దరికి గాయలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని గ్రామీణ ఎస్సై సైదులు తెలిపారు.


దుర్గాపురం స్టేజీ వద్ధ.

అనంతగిరి, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండగూడెంకు చెందిన రైతు మొదల్ల పెంటయ్య (45) ట్రాక్టర్‌ మరమ్మతుకు గురికావడంతో కోదాడకు వచ్చారు. అక్కడి నుంచి మెకానిక్‌ ఇంటికి తీసుకెళ్లి పని పూర్తయిన తర్వాత మళ్లీ కోదాడలో దింపాడు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అనంతగిరి ఏఎస్‌ఐ ఇస్మాయిల్‌ తెలిపారు.


అనుమానాస్పద స్థితిలో యువకుడు..

నాంపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎదుళ్ల రాములు, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లడంతో చిన్న కుమారుడైన ఎదుళ్ల మనోజ్‌(21) ఆదివారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లో నిద్రించారు. సోమవారం ఉదయం స్నేహితులు లేచి చూసే సరికి మనోజ్‌ పక్క గదిలో చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. విషయం గమనించిన స్నేహితులు మృతదేహాన్ని కిందకు దింపి బంధువులు, స్థానికులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌కే.రఫీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని