logo

నిర్లక్ష్యం నీడలో రైతు వేదికలు

గ్రామాలలో రైతులకు వ్యవసాయానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందించడానికి సాంకేతిక పద్ధతులు, పరిశోధన అంశాలు, పంటల కాలంలో ఎరువులు, పురుగు మందుల వాడకం,

Published : 18 Jan 2022 02:40 IST

అనుముల రైతువేదిక భవనం ఆవరణలో పిచ్చి మొక్కలు

హాలియా, న్యూస్‌టుడే: గ్రామాలలో రైతులకు వ్యవసాయానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందించడానికి సాంకేతిక పద్ధతులు, పరిశోధన అంశాలు, పంటల కాలంలో ఎరువులు, పురుగు మందుల వాడకం, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తదితర అంశాలు అందించడానికి వీలుగా ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లాలో క్లస్టర్ల వారీగా 146 రైతు వేదికలు ఉండగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో 31 క్లస్టర్లలో నిర్మాణం చేపట్టారు. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు కేటాయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 314 నిర్మాణాలు చేపట్టారు. వాటిలో చాలా వరకు పూర్తికాగా కొన్ని ప్రాంతాలలో నిర్మాణంలో నత్తనడకలో ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించేందుకు నిర్మాణం పూర్తైన వాటిని రైతుల సమావేశానికి ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా నిర్మాణం పూర్తైన భవనాలలో నిర్వహణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

బాధ్యత ఎవరిది..?

పూర్తయిన పలు రైతు వేదికల భవనాలను ఎమ్మెల్యేలు ప్రారంభించాలని అధికారులు ఎదురుచూస్తుండగా.. వాటి నిర్వహణ ప్రశ్నార్థకమైంది. ఒక్క నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనే ఆరు మండాలలో 31 క్లస్టర్లకుగాను 28 పూర్తయ్యాయి. నిధులు ఉన్నప్పటికీ మిగతావి పూర్తి చేయడంలో గుత్తేదారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిడమనూరులో 3, త్రిపురారంలో 2 రైతు వేదికలు ప్రారంభం చేయగా మరో 23 రైతు వేదికలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు వీటి బాధ్యత అప్పగించినప్పటికీ తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పలు వేదిక ఆవరణల్లో పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా, దుమ్ముదూళితో దర్శనమిస్తున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత లేమితో కొన్నిచోట్ల రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాల వేదిక అవుతున్నట్లు ఓ వ్యవసాయ అధికారి ‘న్యూస్‌టుడే’తో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ ఏర్పాటు నిర్వహణ, పర్యవేక్షణకు సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు.

నిర్వహణకు నిధులు

- శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

రైతు వేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రతీ వేదికకు రూ.2 వేలు చొప్పున వచ్చే నెల నుంచి ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు అందించనుంది. గ్రామ పంచాయతీ వారు కూడా నిర్వహణలో సహకరించాల్సిన అవసరం ఉంది. రైతులు, గ్రామ పంచాయతీ, వ్యవసాయ శాఖ అధికారులు సమష్టిగా రైతు వేదికలను కాపాడాలి. నిర్మాణం పూర్తి కాని వాటిపై ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రారంభం కాని రైతు వేదికలనూ సమావేశాలకు ఉపయోగిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని