logo

పాపం.. చిన్నారులు

అభం శుభం తెలియని ఈ చిన్నారులకు కొండంత కష్టం వచ్చింది. తల్లిదండ్రులే ప్రపంచమైన వారికి ఆ ఇద్దరూ దూరమవడంతో పాలుపోని స్థితిలో తల్లడిల్లిపోతున్నారు. తమను నడిపించే పెద్దదిక్కు లేక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 19 Jan 2022 04:17 IST

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే

జహంగీర్‌ కుమారులు జావీద్‌, జునేద్‌కు ఆర్థిక సాయం అందజేస్తున్న ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ముచ్చర్ల ఏడుకొండల్‌ యాదవ్‌

అభం శుభం తెలియని ఈ చిన్నారులకు కొండంత కష్టం వచ్చింది. తల్లిదండ్రులే ప్రపంచమైన వారికి ఆ ఇద్దరూ దూరమవడంతో పాలుపోని స్థితిలో తల్లడిల్లిపోతున్నారు. తమను నడిపించే పెద్దదిక్కు లేక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
రెండున్నరేళ్ల క్రితం తండ్రి.. మొన్న తల్లి..
పీఏపల్లి మండలం కోదండాపురం గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్‌, సనా దంపతులకు ఇద్దరు కుమారులు. జహంగీర్‌ రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద గల హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటులో రోజూవారీ కూలీగా పనిచేసేవారు. ఈ క్రమంలో పక్షవాతం వచ్చి రెండున్నరేళ్ల క్రితం మృతిచెందారు. అనంతరం ఆయన భార్య సనా భర్త జహంగీర్‌ స్థానంలో ప్లాంటులో స్వీపర్‌గా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటూనే కుమారులు జావీద్‌ను ఇంటర్‌, జునేద్‌ను తొమ్మిదో తరగతి చదివిస్తోంది. మూడు రోజుల క్రితం తల్లి సనాకు ఫిట్స్‌ రావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించి చికిత్స అందిస్తుండగా కోమాలోకి వెళ్లిన సనా.. సోమవారం తుదిశ్వాస విడిచింది. సొంత ఇల్లు కూడా లేకపోవడం, అంత్యక్రియలకు డబ్బులూ లేకపోవడంతో గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ముచ్చర్ల ఏడుకొండల్‌ యాదవ్‌ రూ.10 వేల ఆర్థికసాయంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత చిన్నారులకు ఆదుకునేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని