logo

మెరుగుబడితే మేలు

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో కాలంగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నిధులు లేకపోవడంతో సమస్యలు ఉన్నా అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. కరోనా కారణంగా

Published : 19 Jan 2022 04:17 IST

ఆరుబయట తరగతుల నిర్వహణ

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో కాలంగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నిధులు లేకపోవడంతో సమస్యలు ఉన్నా అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినా ఆ స్థాయిలో సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారనున్నాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో మేలు కలగనుంది.
రానున్న మూడేళ్లలో విద్యారంగంలో మన ఊరు మన బడి కింద సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా,  ఫర్నిచర్‌, భవనాలకు మరమ్మతులు, రంగులు, గ్రీన్‌చాక్‌ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, కిచెన్‌ షెడ్‌లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం, డిజిటల్‌ విద్య, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌ నిర్మాణం తదితర అంశాలపై దృష్టి సారించనున్నారు. దీంతో పాటు ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమం బోధనకు అవసరమైన శిక్షణలు, సౌకర్యాలు కల్పించాలని కేబినెట్‌లో నిర్ణయించారు.


ఈ చిత్రం మాడ్గులపల్లి మండలం ఇందుగుల ప్రాథమిక పాఠశాలది. ఇక్కడ 102 మంది విద్యార్ధులు ఉన్నారు. అయిదు తరగతులు ఉన్న పాఠశాలలో ఒకే తరగతి గది ఉంది. అందులోనే అన్ని తరగతులు జరుగుతున్నాయి. అదే గదిలో స్టోర్‌, స్టాఫ్‌ రూంగాను వినియోగిస్తున్నారు. మరో గది ఉన్నా అది శిథిలావస్థలో ఉంది. విద్యార్థులకు మొత్తం నలుగురు ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం, తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతుండటంతో పక్కనే ఉన్న జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలోని గ్రంధాలయం గదిలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇలాంటి పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయి.
సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం
రాష్ట్రప్రభుత్వం మన ఊరు-మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్లమాధ్యమం ప్రారంభించాలనుకోవడం శుభపరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది ఆంగ్లమాధ్యమం వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్లమాధ్యమం పెడితే విద్యార్థులు ఎక్కువ మంది పెరిగే అవకాశముందని ఎప్పటి నుంచో అంటున్నారు. అందుకు తగిన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఉండాలి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కొన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం నడుస్తోంది. నల్గొండ జిల్లాలో దాదాపు 350 వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఆసక్తి, స్థానికుల సహకారంతో ఆంగ్లమాధ్యమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని