logo

ఉద్యానవనాలపై నిర్లక్ష్యపు నీడ

ప్రజలకు ఆహ్లాదం పంచటంతో పాటు తీరిక సమయాల్లో సేద తీరేందుకు వీలుగా పురపాలికల్లో ఉద్యానవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాత పురపాలక సంఘాల్లో పార్కులు ఉన్నా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే ఉండగా మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోవటం లేదు.

Published : 19 Jan 2022 04:17 IST

చండూరు పురపాలికలో గడ్డిమొక్కలు పెరిగి అధ్వానంగా మారిన ఉద్యానవనం

చండూరు, న్యూస్‌టుడే: ప్రజలకు ఆహ్లాదం పంచటంతో పాటు తీరిక సమయాల్లో సేద తీరేందుకు వీలుగా పురపాలికల్లో ఉద్యానవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాత పురపాలక సంఘాల్లో పార్కులు ఉన్నా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే ఉండగా మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోవటం లేదు. ఇక కొత్త పురపాలికల్లో ఓపెన్‌ జిమ్‌లు ఊసే లేకుండా పోయింది. కొన్నింటిలో నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకొంటున్నారు. సెలవు రోజుల్లో ఆహ్లాదంతో పాటు వ్యాయామం కోసం జిమ్‌ చేసుకోవటానికి బయటికి వెళ్లేందుకు పార్కులు, జిమ్‌లు లేని పరిస్థితి.

కొత్త పురపాలికల్లో చాలా వరకు ఎక్కడ పార్కులు, జిమ్‌లు లేవు. ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన ఆట స్థలాల్లోనే ప్రజలు వాకింగ్‌ చేయటం, ఉదయం, సాయంత్రం వేళలో వచ్చి కూర్చొని సేదతీరుతున్నారు. వాహనాల రాకపోకలతో ప్రమాదమని తెలిసి కూడా చాలా వరకు రోడ్ల వెంట కూడా వాకింగ్‌ చేస్తున్నారు.  ప్రైవేటుగా జిమ్‌లు కూడా అందుబాటులో ఉండవు. ఇళ్ల వద్దనే తోచిన వ్యాయామాలు చేస్తున్నారు. నిజానికి పురపాలికల్లో వాకింగ్‌ ట్రాక్‌లను కూడా నిర్మించాల్సి ఉంది. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పటికైన అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వీలైనంత ఎక్కువ చోట్ల ఉద్యానవనాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి
* చండూరు పురపాలికలో పోలీసు ఠాణా పక్కన పార్కు నిర్మాణం పూర్తి కావొచ్చి నెలలు గడుస్తున్న ప్రారంభించే తీరుబాటు పాలకవర్గానికి లేకుండా పోయిందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన పార్కు నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. పనులు ఆగిపోవటంతో  ప్రస్తుతం పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. ఇక ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంతో పాటు ఇతర ఖాళీ స్థలాల్లో ఓపెన్‌ జిమ్‌లు, వాకింగ్‌ ట్రాక్‌ వేయాలని స్థానికంగా కోరుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు.
* దేవరకొండ పురపాలికలో పార్కు నిర్మాణం కొనసాగుతోంది. రెండు ఓపెన్‌ జిమ్‌లు ఉన్నాయి.
* చిట్యాలలో రూ.32లక్షల అంచనాతో ఎకరం విస్తీర్ణంలో ఓపెన్‌ జిమ్‌, పార్కు పనులు చేపట్టారు. ఇంకా పూర్తి కాలేదు.
* సాగర్‌లో ఓపెన్‌ జిమ్‌లు లేవు, పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి.  
* మిర్యాలగూడలో ఓపెన్‌ జిమ్‌లు 6 ఉన్నాయి. నిర్వహణ లోపంతో పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి.
* హాలియాలో పురపాలికలో పాత పశువుల సంతలో 2019లో మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.18 లక్షలతో చిన్న పిల్లల పార్కు, ఓపెన్‌ జిమ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చుట్టు కంచె కూడా వేశారు. రెండేళ్లుగా నిలిచిపోయాయి.
* నేరుడుచర్లలో ఎకరం స్థలంలో పార్కు నిర్మాణానికి రూ.64 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఓపెన్‌ జిమ్‌లకు నిధులు మంజూరు కాలేదు.  
* చౌటుప్పల్‌లో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు కాలేదు. 3 మియావాకి పార్కులు 1.30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.  
* ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, తిరుమలగిరి, పోచంపల్లి పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు లేవు
పార్కులు ప్రారంభిస్తాం
- వెంకట్రాం, కమిషనర్‌, చండూరు పురపాలిక

చండూరులో రెండు పార్కుల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని అనివార్య కారణాలతో ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయమని పై నుంచి ఆదేశాలు ఏమి లేవు. దీనిపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చిస్తాం. నూతన పురపాలిక కావటంతో కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు, అనుమతులు రావటంలో కొంత మేర ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని