logo

జిజ్ఞాసతో సృజనాత్మకత వెలికితీత

విద్యార్థి జీవితంలో స్థిరపడాలంటే ఇంటర్మీడియట్‌ తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. వారు డిగ్రీలో ఎంచుకున్న సబ్జెక్టు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌ను ప్రతిబింబిస్తాయి. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల జీవితం ముఖ్యమైనది. విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో నూతన ఆవిష్కరణలు

Published : 20 Jan 2022 02:45 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 77 ప్రదర్శనలు

జిజ్ఞాస పరిశోధనలో భాగంగా తన సబ్జెక్టును వివరిస్తున్న విద్యార్థి

కోదాడ, న్యూస్‌టుడే: విద్యార్థి జీవితంలో స్థిరపడాలంటే ఇంటర్మీడియట్‌ తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. వారు డిగ్రీలో ఎంచుకున్న సబ్జెక్టు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌ను ప్రతిబింబిస్తాయి. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల జీవితం ముఖ్యమైనది. విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో నూతన ఆవిష్కరణలు వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ‘జిజ్ఞాస ప్రదర్శన’ల ద్వారా అవకాశం కల్పిస్తుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతులు లభిస్తాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రదర్శనలు పంపించారు. వచ్చే నెలలో వాటి ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జిజ్ఞాస ప్రదర్శనలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

గతంలో పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు మాత్రమే వారు చదివే సబ్జెక్టుల ఆధారంగా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉండేవి. 2016-17 విద్యా సంవత్సరం నుంచి సీసీఈ( కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌) వారు జిజ్ఞాస పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులకు తమ సబ్జెక్టులకు సంబంధించిన పరిశోధనలు చేసే అవకాశం లభించింది. ప్రతి ఏడాది రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మొత్తం 17 సబ్జెక్టుల్లో ఈ ప్రదర్శనలు చేయవచ్ఛు

నగదు ప్రోత్సాహం..

ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన అయిదుగురు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రాజెక్టును తయారు చేస్తారు. బృందానికి పర్యవేక్షకుడిగా సబ్జెక్టు అధ్యాపకుడు ఉంటారు. మొదటి సారిగా కళాశాల స్థాయిలో ఎంపికైన తర్వాత అదే ప్రదర్శనను ఐదు నిమిషాల వీడియోలో పొందుపరచాలి. ఆ వీడియోను రాష్ట్ర స్థాయి ఎంపిక జరిగే పోటీలకు పంపిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలంటే విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుకు అనుబంధగా సమకాలీన, వినూత్న అంశాలు ఉండాలి. ఆ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో విద్యార్థులు పరిశీలించాలి. రాష్ట్ర స్థాయిలో శాస్త్రవేత్తలు, అద్యాపకులు న్యాయనిర్ణేతలుగా ఉంటారు. ఈ పోటిల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా బృందానికి రూ. 30 వేలు, పర్యవేక్షకుడికి రూ. ఐదు వేలు, ద్వితీయ బహుమతి పొందిన బృందానికి రూ. 18వేలు, పర్యవేక్షకుడికి రూ. మూడు వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ప్రశంసా పత్రం అందజేస్తారు.


ఇదొక మంచి అవకాశం

- నాగు, ప్రిన్సిపల్‌, కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, కోదాడ

ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు జిజ్ఞాన ప్రదర్శనల ద్వారా ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. గతేడాది కరోనా విజృంభణతో ఈ ప్రదర్శనలు చేయలేదు. ఈ ఏడాది ప్రదర్శనలు చేసి వీడియో రూపంలో పంపించాం. విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇదొకటి చక్కటి అవకాశం.


జిల్లా డిగ్రీ విద్యార్థులు పంపించిన కళాశాలలు ప్రదర్శనలు

నల్గొండ 6 8,950 51

సూర్యాపేట 2 1,213 17

యాదాద్రి 2 760 9


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని