logo

ఖాళీల భర్తీపై..వీడని సందిగ్ధం

సర్కారు పాఠశాలల్లో మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతున్నా.. తక్షణ అవసరాలపై స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 21 Jan 2022 02:40 IST

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: సర్కారు పాఠశాలల్లో మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతున్నా.. తక్షణ అవసరాలపై స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికుల భర్తీ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ కార్మికులు పాఠశాలల్లో పారిశుద్ధ్య ప్రక్రియను చేపట్టాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా క్షేత్రస్థాయి అమలు కావట్లేదు. దీంతో ఉపాధ్యాయులే సొంతంగా ఖర్చుచేస్తూ పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల కొరత వెంటాడుతుంది.

తీరని కొరత..

ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ కారణంగా విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 25వేల వరకు కొత్తగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో నల్గొండ జిల్లాలో దాదాపు 400 మంది వరకు విద్యావాలంటీర్లను వినియోగించి విద్యాబోధన అందించారు. కొవిడ్‌కు ముందు నుంచే విద్యావాలంటీర్లను తొలగించి తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడింది. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సమన్వయం చేసే విషయంలో కొంత కష్టంగా మారింది. విద్యాశాఖ అధికారులు కలెక్టర్‌ ఆమోదంతో విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్ధుబాటు చేపట్టినా వాళ్లంతా వెళ్లలేదు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు జరిపారు. నల్గొండ జిల్లా నుంచి ఎస్‌జీటీలు 246 మంది ఇతర జిల్లాలకు వెళ్లగా అక్కడి నుంచి దాదాపు 376 మంది నల్గొండ జిల్లాకు వచ్చారు. ఈ లెక్కన నల్గొండ జిల్లాకు అదనంగా 130 మంది కొత్తగా వచ్చారు. డిండి, చందంపేట, నేరెడుగొమ్ము, పీఏ పల్లి తదితర మండలాల్లోని కొన్ని పాఠశాలలకు కొత్తగా టీచర్లు వచ్చినా.. ఇంకా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. 2015 తరువాత ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండటం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం, ఎంఈవో పోస్టుల ఖాళీలుగా ఉండటం తదితర అంశాలన్ని క్షేత్రస్థాయిలో సరైన బోధనకు, పర్యవేక్షణకు అడ్డంకిగా మారాయి. జిల్లాలోని ఎంఈవో పోస్టుల్లో ఉన్నవారంతా ఇంఛార్జిలే కావడం గమనార్హం. చందంపేట, డిండి ప్రాంతాల్లో గెజిటెడ్‌ హెచ్‌ఎంలు లేక స్కూల్‌ అసిస్టెంట్‌లే ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు సైతం ఖాళీలున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని