logo

వేలం మాటున వ్యాపారమా!

పీడీఎస్‌ బియ్యం అక్రమార్కుల సంపాదనకు వరం. పేదల నుంచి సేకరించి వాటి ప్రాసెస్‌ చేసి సన్న బియ్యంగా మార్కెట్‌లోకి వదిలి సొమ్ము చేసుకుంటారు.

Published : 22 Jan 2022 03:42 IST

అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు

విచారణ చేపట్టిన పోలీసులు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే


హుజూర్‌నగర్‌: పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బియ్యం లారీలు

పీడీఎస్‌ బియ్యం అక్రమార్కుల సంపాదనకు వరం. పేదల నుంచి సేకరించి వాటి ప్రాసెస్‌ చేసి సన్న బియ్యంగా మార్కెట్‌లోకి వదిలి సొమ్ము చేసుకుంటారు. అయితే ఇటీవల పోలీసులు మత్తు పదార్థాలు, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యాపారులు రూటు మార్చారు. పలు సందర్భాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యాన్ని ఇటీవల కాలంలో అధికారులు వేలం ద్వారా విక్రయిస్తున్నారు. వాటిని కొద్ది మొత్తంలో దక్కించుకుని.. ఆ పత్రాలను చూపుతూ తనిఖీల సమయంలో అధికారులకు చూపుతూ భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని ఎల్లలు దాటిస్తున్నారు. అక్రమార్జనకు తెర తీస్తున్నారు.

పత్తా లేని వ్యాపారి

హుజూర్‌నగర్‌ పట్టణంలో సోమవారం అర్థరాత్రి పోలీసులు 500 క్వింటాళ్ల బియ్యంతో మిర్యాలగూడ నుంచి కాకినాడకు వెళ్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో మిర్యాలగూడ ఆర్‌ఎస్‌ ట్రేడర్స్‌ నుంచి బియ్యం సరఫరా చేస్తున్నట్లు వేబిల్లులు లభించాయి. వాటితో పాటు ఇటీవల ఓ వ్యాపారి మంచిర్యాల జిల్లాలో జరిగిన పీడీఎస్‌ బియ్యం వేలం దక్కించుకున్న సరకుకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు సైతం లభించాయి. రెండు రకాల పత్రాలు లభించడంతో పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ఆర్‌ఎస్‌ ట్రేడర్స్‌ యజమానికి సమాచారం అందించారు. ఆధారాలు చూపించి లారీలు, సరకును తీసుకెళ్లాలని కోరారు. అయితే ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా.. సదరు వ్యాపారి పత్తా లేడు. పోలీసులనూ సంప్రదించలేదు. అధికారులకూ ఆధారాలూ అందించలేదు. ఈ విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ బియ్యం కాబట్టే వ్యాపారి రాలేదని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది.

నిఘా నుంచి తప్పించుకునేందుకే..

ఘటన జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. నిజనిజాలు తెలుసుకునేందుకు మొదటగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణలో ఇది నయా మోసంగా తేలినట్లు సమాచారం. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరూ వ్యాపారులు ఈ రకం మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలో ఓ వ్యాపారి ఇలా మోసం చేస్తూ పట్టుబడినట్లు తెలిసింది. వారూ తెలివిగా పీడీఎస్‌ బియ్యాన్ని వేలం ద్వారా కొద్ది మొత్తంలో కొనుగోలు చేస్తారు. అధికారులు అందించిన అనుమతి పత్రాలను ఫోర్జరీ ద్వారా తూకంలో తేడాలు చేసి వివిధ పద్దతుల్లో సేకరించిన అక్రమ బియ్యం రవాణా చేస్తున్న లారీల్లో అనుమతి పత్రాల మాదిరిగా ఉంచుతారు. కొన్ని దఫాలు వీళ్ల పాచిక పారుతుంది. ఫలితంగా రూ. లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. ఇలాంటి వ్యాపారం చేసేందుకు మిర్యాలగూడలో మూత పడిన మిల్లులను లీజుకు తీసుకుని దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణపట్టె ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా జరుగుతుంది. ఫలితంగా నిఘా నుంచి తప్పించుకోవచ్చనే తలంపుతో ఉన్నారు.

పట్టుబడినవి రేషన్‌ బియ్యమే : -రాజశేఖర్‌, డీటీసీఎస్‌, హుజూర్‌నగర్‌

పట్టుబడిన రెండు లారీల బియ్యం రేషన్‌ బియ్యంగానే తేలింది. బియ్యాన్ని గోదాములో భద్రపరిచారం. రెండు లారీలను పోలీసులకు అప్పగించాం. ఆర్‌ ఎస్‌ ట్రేడర్స్‌ నుంచి సరఫరా అవుతున్నట్లు పత్రాలున్నప్పటికి ఇప్పటి వరకు వారు విచారణకు రాలేదు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని