logo

విషాద ప్రయాణం

దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకొంది. మొక్కులు తీర్చి తిరుగు ప్రయాణంలో మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకొనేవారు.

Published : 22 Jan 2022 03:42 IST

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న ద్విచక్రవాహనం

తండ్రి, చిన్నకుమారుడు మృతి


చెర్వుగట్టులో దర్శనం అనంతరం భార్య, పిల్లలతో కలిసి రామకృష్ణ దిగిన స్వీయ చిత్రం

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకొంది. మొక్కులు తీర్చి తిరుగు ప్రయాణంలో మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకొనేవారు. అంతలోనే వారి కుటుంబంలోని ఇద్దరిని మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ రహదారి ప్రమాదంలో తండ్రి, చిన్నకుమారుడు చనిపోయారు. తల్లి, పెద్దకుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ ఎన్‌.శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. లక్కారం గ్రామానికి చెందిన డాకోజి రామకృష్ణ(42)కు, భార్య లక్ష్మీ, కుమారులు మణిచరణ్‌, ఈశ్వర్‌సాయి(9) ఉన్నారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో పంతంగి టోల్‌ప్లాజా దాటగానే ఆరెగూడెం స్టేజీ సమీపంలో ఓ డీసీఎం వాహనం మరమ్మతుకు గురై నిలిచిపోయింది. రామకృష్ణ ద్విచక్రవాహనం అదుపు తప్పి డీసీఎంను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రామకృష్ణ చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో, చిన్నకుమారుడు ఈశ్వర్‌సాయి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. లక్ష్మీ, పెద్దకుమారుడు మణిచరణ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. భర్త, చిన్నకుమారుడు మరణం ఆమెకు తెలియదు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి హైదరాబాద్‌ మానవత్వం చాటాడు. క్షతగ్రాతులైన లక్ష్మీ, ఈశ్వర్‌ సాయిని బెంజ్‌కారులో ఎక్కించుకుని ఎల్బీనగర్‌ కామినేనికి తరలించారు. అప్పటికే ఈశ్వర్‌సాయి ప్రాణాలు విడిచాడు.


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ, మణిచరణ్‌

విషాదఛాయలు..

రామకృష్ణ హెయిర్‌ సెలూన్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి రాందాస్‌ మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. తల్లి శారదమ్మ, భార్య, పిల్లల పోషణ భారంగా సాగుతోంది. ఇంటి పెద్ద దిక్కు రామకృష్ణ, చిన్న కుమారుడు ఈశ్వర్‌సాయి మృతి చెందడం, భార్య, లక్ష్మీ, పెద్దకుమారుడు మణిచరణ్‌ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉండటంతో కుటుంబ సభ్యుల్లో, లక్కారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


కారు బోల్తా.. ఒకరు మృత్యువాత


నకిరేకల్‌ వద్ద ప్రమాదానికి గురైన కారు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌- తానంచర్ల 365 నంబర్‌ కొత్త జాతీయ రహదారిపై నకిరేకల్‌ శివారులో కారు బోల్తా పడిన ప్రమాదంలో మహిళ మృతి చెందారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో నివాసం ఉంటున్న పసుపులేటి సతీశ్‌ తన భార్య వరలక్ష్మి, కుమారుడు వికాస్‌తో కలిసి కారులో జంగారెడ్డిగూడెం వెళ్లి తిరుగు ప్రయాణంలో కొత్త జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్‌ వెళ్తున్నారు. నకిరేకల్‌ వద్ద గురువారం రాత్రి కారు అదుపు తప్పిందని సీఐ కె.నాగరాజు శుక్రవారం తెలిపారు. కారు వెనుక టైరు పంక్చర్‌ కావడంతో రోడ్డు కిందగా నిమ్మ తోటలోకి దూసుకెళ్లి చెట్టుకు ఢీకొని బొల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో పసుపులేటి వరలక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ఇద్దరు సీటు బెల్టు ధరించడం వల్లే సురక్షితంగా ఉన్నారని సీఐ వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


ఏరు దాటుతూ ఇసుక గుంతలో కూరుకుపోయి..


పూలమ్మ

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: పొలం నాటుకు వెళ్తూ ఏరు దాటుతుండగా ఇసుక గుంతలో మునిగిపోయి మహిళ దుర్మరణం పాలైన ఘటన మక్తాకొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ (34)కు ఏటి అవతల ఖమ్మం జిల్లా కాకరావాయి గ్రామ పరిధిలో రెండెకరాల పొలం ఉంది. ఈ పొలంలో నాట్లు వేసేందుకు మక్తాకొత్తగూడెంలోని తన ఇంటి నుంచి బయల్దేరి ఏరుదాటాలి. గతంలో ఏటిలో ఇసుక కోసం ఇష్టారాజ్యంగా గుంతలు తవ్వారు. ఏటిలో ఉన్న నీళ్లలో గుంతలు ఎక్కడున్నాయో కనిపించే పరిస్థితి లేదు. పూలమ్మ శుక్రవారం ఉదయం నీళ్లలో నడుచుకుంటూ ఏరు దాటుతున్న క్రమంలో ఇసుక గుంతలోకి జారిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఏటిలో మునిగిపోతున్న పూలమ్మను కాపాడేందుకు సమీపంలో గీతకార్మికుడు హుటాహుటిన తాటిచెట్టు దిగి అక్కడికి వచ్చారు. అప్పటికే పూలమ్మ ప్రాణాలు వదిలారు. పూలమ్మకు భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ప్రమాదంపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై యాదవేందర్‌రెడ్డి తెలిపారు.


రైలు కింద పడి వ్యాపారి బలవన్మరణం

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది రైలు కింద వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగిరి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగిరికి చెందిన పచ్చిమట్ల వెంకటేష్‌(42) హోటల్‌తోపాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నూతన ఇల్లు నిర్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపంతో శుక్రవారం ఇంట్లో నుంచి వెళ్లి రాయగిరి చెరువు సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వేపోలీసులు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రి శవాగారానికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.


పైపులు జారిపడి డ్రైవర్‌ దుర్మరణం

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ టెర్మినల్‌(ఐవోసీఎల్‌)లో జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. ఐవోసీఎల్‌లో మిగిలిన ఇంధన ఇనుప పైపులను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు తరలించేందుకు బీహార్‌ రాష్ట్రం సారన్‌ జిల్లా మోతాహా ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ అజయ్‌కుమార్‌ సింగ్‌(51) గురువారం మధ్యాహ్నాం ఇక్కడికి వచ్చారు. క్రేన్‌ సాయంతో పైపులను లారీలో అమర్చారు. పైపులను అమర్చిన తర్వాత లారీ సిల్‌ సరిగ్గా ఉందా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పైపులు జారీ అజయ్‌కుమార్‌ సింగ్‌పై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని బంధువు అక్షయ్‌కుమార్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


అనుమానాస్పద స్థితిలో యువకుడు..

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ముషంపల్లి గ్రామానికి చెందిన బండా అమృతరెడ్డి(42) మిర్యాలగూడలో ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ముషంపల్లిలోని తన వ్యవసాయ భూమి వద్దకు గురువారం వచ్చినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. తోటలో ఉన్న గది వద్ద కాలు జారి కిందపడడంతో తలకు బలమైన గాయాలై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన భర్త మృతికి పలు అనుమానాలున్నాయని అమృతరెడ్డి భార్య మంజుల ఫిర్యాదుతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని