logo

కరోనా చుట్టేస్తోంది..

ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వారిలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఉండడంతో ప్రజా సంబంధ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి.

Updated : 22 Jan 2022 05:18 IST

ప్రభుత్వ కార్యాలయాలను వదలనీ మహమ్మారి


చండూరు పురపాలిక భవనంలోకి బయటి వారు రాకుండా తాడు అడ్డుపెట్టి, దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన పెట్టె

* నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారితో పాటు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, దస్తావేజు లేఖర్లకు పలువురికి పాజిటివ్‌ రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* యాదగిరిగుట్ట పొలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న 20 మంది వరకు పాజిటివ్‌ రావడంతో విధులకు దూరంగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప స్టేషన్‌కు రావొద్దని, ఒకవేళ వచ్చినా ఒక్కరు మాత్రమే రావాలని సూచనలు చేశారు. 100 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే నేరుగా పోలీసులు వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తామని పేర్కొంటున్నారు. మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం ముగ్గురు సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు.

* సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) తహసీల్దారు కార్యాలయంలో నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. కార్యాలయం శానిటైజ్‌ చేసి జాగ్రత్తలు తీసుకున్నారు.

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వారిలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఉండడంతో ప్రజా సంబంధ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. కొవిడ్‌ బారిన పడిన వారు ఏడు నుంచి 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌కు వెళ్లడంతో పాటు ఆసుపత్రుల్లో చికిత్సకు పరుగులు తీస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానంగా పోలీస్‌ శాఖలో 42 మంది అధికారులు, సిబ్బంది మహమ్మారి బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడుతుండడంతో కొంత వరకు టీకా సరఫరా, జ్వర సర్వే, ఇతర వ్యాక్సిన్‌ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చండూరు: చండూరు పురపాలిక కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు శుక్రవారం కరోనా బారినపడ్డారు. వీరితో పాటు ఒకరిద్దరు సిబ్బందికి కూడా లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. కార్యాలయం లోపలికి ప్రజలు ఎవరు రాకుండా బయట ద్వారం వద్దనే దరఖాస్తుల స్వీకరణ పెట్టె ఏర్పాటు చేశారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశాన్ని పక్కనే ఉన్న పంచాయతీరాజ్‌ అతిథి భవనంలో నిర్వహించారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయ ప్రవేశ ద్వారానికి తాడు కట్టారిలా..

ముందు జాగ్రత్తలు పాటిస్తూ...

గతంలో కొవిడ్‌ బారిన పడిన కొందరు వారు వాస్తవాలను దాచిపెట్టి విధుల్లో పాల్గొనే వారు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినప్పటికి ఇతరులకు హాని కలిగించకుండా ముందు జాగ్రత్తలతో నిబంధనలు పాటిస్తూ హోం ఐసోలేషన్‌తో పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లా స్థాయి అధికారుల సూచనల మేరకు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండి విధుల్లోకి వస్తున్నారు. మరి కొందరు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎక్కువ రోజులు విధులకు దూరంగా ఉంటున్నారు.

రామన్నపేట: రామన్నపేట మండల పరిషత్తు కార్యాలయంలో వరుసగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కార్యాలయంలో మరో నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఎంపీడీవోతో పాటు కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్‌ స్టేషన్‌లో అయిదుగురికి, ప్రాంతీయాసుపత్రిలో పని చేస్తున్న నలుగురు సిబ్బందికి, 104 సిబ్బందిలో ఇద్దరికి, మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కరికి, ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఒకరు, మర్రిగూడ ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి మహమ్మారి బారినపడ్డారు.

గడిచిన నాలుగు రోజుల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ కొవిడ్‌ బారిన పడిన వారి వివరాలు..

యాదాద్రి152

నల్గొండ 180

సూర్యాపేట136

మొత్తం: 468

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని