logo

కొవిడ్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్‌

అర్హలైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకోవాలని, నిబంధనల ప్రకారం ముందస్తు నివారణ టీకా వేయించుకోవాలని జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి సూచించారు.

Published : 22 Jan 2022 03:42 IST


ఆత్మకూరు పీహెచ్‌సీలో కొవిడ్‌ టీకా పంపిణీ గురించి సిబ్బందిని ఆరా తీస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: అర్హలైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకోవాలని, నిబంధనల ప్రకారం ముందస్తు నివారణ టీకా వేయించుకోవాలని జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి సూచించారు. అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరంతోపాటు కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని, జిల్లాలో కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆత్మకూరు పీహెచ్‌సీని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల గదిని పరిశీలించి రోజూ చేస్తున్న పరీక్షలను ఆరా తీశారు. ప్రసూతి, రోగులు, టీకా గది, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం మందుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కరుణాకర్‌, సాంబులమ్మ, సుజాత, జ్యోతి, సరిత, శీరిష, లలిత, తదితరులు ఉన్నారు. తరువాత తహసీల్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్లను ఆమె పరిశీలించారు. రైతుల భూ సమస్యల దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని తహసీల్దార్‌ ఎం.జయమ్మను ఆదేశించారు.

మోటకొండూరు: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్‌ పమేలా సత్పతి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటా ఆరోగ్య సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఇ.వీరాస్వామి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ, ఉపసర్పంచి రేగు శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

ఆరోగ్య వివరాలు సమగ్రంగా నమోదు చేయండి... యాదగిరిగుట్ట పట్టణం: జ్వర సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని పరిశీలించి, ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. మండలంలోని మహబూబ్‌పేటలో ఇంటింటి ఆరోగ్య సర్వేను శుక్రవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు, టీకా తీసుకున్నది, లేనిది నమోదు చేయాలన్నారు. వాక్సిన్‌ వేసుకోకుంటే వెంటనే ఇవ్వాలని సూచించారు. జ్వర లక్షణాలుంటే ఐసోలేషన్‌ కిట్‌ అందజేసి, ఔషధాలు తీసుకునే విధానం గురించి వివరంగా చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని