logo

ఆటో ఇటో పోకుండా గమ్యానికి..

పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను ఇకమీదట ఇతర పనులకు వినియోగించటం కుదరదు. వార్డుల్లో ఇంటింటికి తిరిగేందుకు వెళ్లి ఒకటి రెండు వీధుల్లో తిరిగి మొత్తం....

Published : 22 Jan 2022 04:01 IST

వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం

భువనగిరి పట్టణం, మిర్యాలగూడ, న్యూస్‌టుడే:

పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను ఇకమీదట ఇతర పనులకు వినియోగించటం కుదరదు. వార్డుల్లో ఇంటింటికి తిరిగేందుకు వెళ్లి ఒకటి రెండు వీధుల్లో తిరిగి మొత్తం పూర్తి చేసినట్లుగా చూపించటం సాధ్యపడదు. వీటికి సాంకేతికతను జోడించి జీపీఎస్‌తో అనుసంధానించాలని పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పురపాలిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలకు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ ( జీపీఎస్‌) పరికరాలను అనుసంధానించనున్నారు. ఈ విధానంతో రోజూ పురపాలికల్లో ఆటోలు ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా చేపట్టేలా చూడనున్నారు. ఇప్పటి వరకు పురపాలికల్లో తెల్లవారుజామున 5 గంటలకు పారిశుద్ధ్య సిబ్బంది, జవాన్లు అంతా ఒకచోట చేరి హాజరు తీసుకున్న తరువాత ట్రాక్టర్లు, ఆటోల్లో తమకు కేటాయించిన వార్డుల్లో చెత్త సేకరణ, వీధులు శుభ్రం చేయటం, డ్రైనేజీల్లో వ్యర్థాల తొలగింపు పనులు చేపడతారు.


మిర్యాలగూడ పురపాలికలో చెత్తసేకరణకు వినియోగిస్తున్న వాహనం

అనధికారిక వినియోగం ఇలా..

* పురపాలిక సిబ్బంది ఆటోలను ఇంటింటి చెత్త సేకరణకు తీసుకువచ్చి వాటిని ఇతర పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

* రోజువారి కేటాయించిన వార్డులోని అన్ని వీధులు తిరగకుండానే తిరిగినట్లు చూపుతూ డీజిల్‌ దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

* కొందరు సిబ్బంది ఇంటింటి నుంచి వెలువడే చెత్తలో ప్లాస్టిక్‌, అట్టలు ఇతర ఇనుప సామగ్రిని వేరు చేసి పాత ఇనుప సామగ్రి దుకాణాల్లో విక్రయించుకుంటున్నారు. ఇలా ఆదాయం సమకూరుతుండగా ఒక్కోసారి చెత్త సేకరణ పక్కన పెట్టి ఇలాంటి పనులకు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

* కొన్ని సందర్భాల్లో స్థానికంగా ప్రజాప్రతినిధులు సైతం ఇతర అవసరాలకు ట్రాక్టర్లు, ఆటోలు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

* నిత్యం ఇంటింటికి చెత్త సేకరిస్తే వీధుల్లో చెత్త వేసే పరిస్థితి ఉండదని భావించిన ఉన్నతాధికారులు జీపీఎస్‌ అనుసంధానించేందుకు నిర్ణయించారు.

* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చెత్త సేకరణ నిత్యం ట్రాక్టర్లు, ఆటోలతో చేపడుతున్నారు.

పురపాలికల వారీగా సమాచారం

ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తాం : - రవీందర్‌సాగర్‌, కమిషనర్‌, మిర్యాలగూడ

పురపాలిక సంచాలకుల ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ జీపీఎస్‌ అనుసంధానం చేస్తాం. మిర్యాలగూడలో ప్రస్తుతం 27 ఆటోలు ఉండగా మరో 21 కొనుగోలుకు ప్రతిపాదించాం. దీంతో 48 వార్డులకు వార్డుకు ఒకటి చొప్పున ఆటో వస్తుంది. అన్ని వాహనాలకు ఒకేసారి టెండర్లు పిలిచి జీపీఎస్‌ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని