logo

మూడేళ్లయినా ముందుకు సాగని సంతలు

ఉమ్మడి జిల్లాలో 15 చోట్ల పంచాయతీల్లో నిర్వహించే సంతల ద్వారా ఆయా పాలకవర్గాలకు ఆదాయం సమకూరుతోంది. అయినా సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 23 Jan 2022 05:41 IST

కట్టంగూర్‌లో సర్వీస్‌ రోడ్డుపై కొనసాగుతున్న సంత (పాత చిత్రం)

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో 15 చోట్ల పంచాయతీల్లో నిర్వహించే సంతల ద్వారా ఆయా పాలకవర్గాలకు ఆదాయం సమకూరుతోంది. అయినా సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద పల్లెల్లో మార్కెట్‌ సౌకర్యాలు కల్పించాలని సంత ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసి మూడేళ్లు గడిచినా ఉమ్మడి జిల్లాలో సంతల ఏర్పాటు జరగడం లేదు.  

గ్రామాల్లో సంతలు (అంగళ్లు) నిర్వహించుకునేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు.

అవగాహన కరవు

* సంతలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్న గ్రామాల్లో ఉపాధి ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునే అవకాశముంది. సంతల ఏర్పాటుకు స్థలం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టవచ్చు.

* స్థలం ఎంపికతోపాటు పంచాయతీలు తీర్మానం చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తారు. తాగునీరు, ఫ్లాట్‌ఫారం, మురుగు కాలువలు, మూత్రశాలలు, వాహనాల పార్కింగ్‌ తదితర సౌకర్యాల కల్పనకు ఉపాధి హామీ పథకంలో చేపట్టవచ్చు.

* ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపులోపు ఈ నిధులు వినియోగించుకోవల్సి ఉంటుంది. దీనిపై పంచాయతీల సర్పంచులకు అవగాహన లేకపోవడంతో ఎక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు.

* నల్గొండ జిల్లాలో మునుగోడు మండలం కామేపల్లి, తిరుమలగిరి సాగర్‌ మండలం బీబీబాయితండలో సంతల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇంకా పనులు ప్రారంభించలేదు. సూర్యాపేట, యాదాద్రిల్లో జిల్లా సంతల నిర్మాణం జరుగలేదు.


సమకూరనున్న ఆదాయం

ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలు 600. చిన్నవి 1140 ఉన్నాయి. పెద్ద పంచాయతీలో 15 సంతలు ఉండగా మరో 18 పంచాయతీల్లో తైబజార్లు, దుకాణ సముదాయం కలిగి ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కట్టంగూర్‌, గురిజాల, అమ్మనబోలు, నార్కట్‌పల్లి, చింతపల్లి, కొండమల్లేపల్లి, గొడకళ్ల, త్రిపురారం, కొండమడుగు, సూర్యాపేట జిల్లాలో నెమ్మికల్‌, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలో  ఆత్మకూర్‌(ఎం), వలిగొండ, రామన్నపేటల్లో సంతలు జరుగుతున్నాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో సంతలు లేవు. ఊరూరా మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక సంతలు లేని వాటిల్లో నెలకొల్పేందుకు చక్కటి అవకాశం దక్కింది.


నిధుల కేటాయింపు ఇలా...

* కేటగిరి-1 విభాగంలో పెద్ద పంచాయతీకి రూ. 15 లక్షలు

* రూ. 10 లక్షలు ఉపాధి హామీ పథకం నిధులు

* రూ. 5 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు

* ప్రతి గ్రామంలో 30 గదులు నిర్మించుకోవచ్చు

* కేటగిరి-2 విభాగంలో చిన్న పంచాయతీకి రూ. 12.50 లక్షలు

* రూ. 9 లక్షలు ఉపాధి హమీ పథకం నిధులు

* రూ 3.50 లక్షలు పంచాయతీ నిధులు

* ప్రతి గ్రామంలో 20 దుకాణాలతో సంత ఏర్పాటు చేసుకోవచ్చు.


ప్రతిపాదనలు ఇస్తే మంజూరు చేస్తాం:  కాళిందిని, డీఆర్‌డీవో నల్గొండ

జిల్లాలో ఇప్పటి వరకు రెండు పంచాయతీల నుంచి ప్రతిపాదనలు రాగా నిధులు మంజూరు చేశాం. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సంతల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధిహామీ పథకం నిధులు వినియోగించుకోవచ్చు. దీని కోసం స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి నిధులు మంజూరు చేస్తాం. ఈ అవకాశంపై సర్పంచులు అవగాహన పొంది తమ గ్రామాల్లో సంతల ఏర్పాటుకు కృషి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని