logo

జనగణమన..@365

నల్గొండలో జాతీయ గీతం మార్మోగుతోంది. దేశం కోసం ఒక నిమిషం అన్న సందేశంతో ప్రతినిత్యం జాతీయ గీతాలాపన సాగుతుంది. అన్ని వర్గాలలో దేశభక్తిని పెంచాలన్న ఉద్దేశ్యంతో ‘జనగణమన పాడుదాం-దేశభక్తిని చాటుదాం’ అంటూ జనగణమన ఉత్సవ సమితి

Published : 23 Jan 2022 05:41 IST

నిత్యగీతాలాపనకు నేటితో ఏడాది పూర్తి

నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్‌లో జాతీయగీతం పాడుతున్న వాహనదారులు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నల్గొండలో జాతీయ గీతం మార్మోగుతోంది. దేశం కోసం ఒక నిమిషం అన్న సందేశంతో ప్రతినిత్యం జాతీయ గీతాలాపన సాగుతుంది. అన్ని వర్గాలలో దేశభక్తిని పెంచాలన్న ఉద్దేశ్యంతో ‘జనగణమన పాడుదాం-దేశభక్తిని చాటుదాం’ అంటూ జనగణమన ఉత్సవ సమితి నేతాజీ స్ఫూర్తితో నల్గొండలో ప్రతి నిత్యం జాతీయ గీతాలాపనకు అంకురార్పన చేసింది. నిత్యజాతీయ గీతాలాపనకు ప్రారంభమే కాని చివరి రోజు ఉండొద్దనే ఉద్ధేశంతో నేతాజీ జయంతినాడు సరిగ్గా 2021 జనవరి 23వ తేదీన జాతీయగీతాలాపనను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నల్గొండలో ప్రతినిత్యం క్రమం తప్పకుండా కొనసాగుతూ నేటికి సంవత్సరం పూర్తిచేసుకుంటుంది.

నల్గొండలోని ప్రధానకూడళ్లల్లో ప్రతినిత్యం జాతీయ గీతాన్ని ఆలపించేలా జనగణమన ఉత్సవ సమితి తగిన ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని 12 ముఖ్యకూడళ్లలో పోలీసుల సహకారంతో మైకులు ఏర్పాటు చేసింది. ఉదయం 8గంటలకు దేశభక్తి గీతాలతో పాటు కరోనా, ఇతర అప్రమత్తతపై సూచనలు కూడా వినిపిస్తాయి. 8.27 నిమిషాలకు జాతీయ పతాకం,  జాతీయ గీతం రూపకర్తల గురించి రెండు నిమిషాల పాటు ఆడియో వినిపిస్తుంది. ఆ తరువాత సరిగ్గా 8.29 నిమిషాలకు నల్గొండలోని 12 ముఖ్యకూడళ్లలో మైకుల ద్వారా జనగణమన జాతీయగీతం ఆలాపన ప్రారంభమవుతుంది. 52 సెకండ్ల పాటు జాతీయ గీతం మార్మోగుతుంది. ఆయా సెంటర్‌ బాధ్యులు ఆ సమయంలో జాతీయ జెండాలు పట్టుకుని ఆయా కూడళ్లలో నిలబడతారు. జాతీయ గీతం వస్తున్న సమయంలో ఆ మార్గంలో వెళ్లేవారు వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లేవారు, ఇతర వర్గాల వారందరు ఎక్కడికక్కడ ఆగిపోతారు. జాతీయ గీతాన్ని పాడుతూ తమ దేశభక్తిని చాటుతారు. అనంతరం యధావిధిగా ట్రాఫిక్‌ వెళ్లిపోతుంది.

తిప్పర్తిలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరిస్తున్న నాయకులు


స్ఫూర్తి ఇదే..

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల క్రితం సీఐ ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించిన జాతీయగీతాలపన కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది నల్గొండకు చెందిన కొంత మంది కమిటీగా ఏర్పడి జనగణమన ఉత్సవ సమితి ఏర్పాటు చేశారు. ట్రెజరీ శాఖలో ఏటీవోగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కర్నాటి విజయ్‌కుమార్‌ అధ్యక్షుడిగా, ఎంవీఆర్‌ స్కూల్స్‌ నిర్వహకులు కొలనుపాక రవికుమార్‌ ప్రధానకార్యదర్శిగా ఏర్పడిన జనగణమన ఉత్సవ సమితి మరికొంత మంది సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.


విస్తరణ దిశగా అడుగులు..

ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు జనగణమన ఉత్సవ సమితి ప్రయత్నిస్తుంది. ఈ నెల 27న తిప్పర్తిలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరో ఆరు నెలల్లో జిల్లాలోని మరిన్ని పట్టణాల్లోనూ విస్తరిస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు కర్నాటి విజయ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి కొలనుపాక రవికుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని