logo

గ్రంథాలయానికి మహర్దశ

బాపూజీ గ్రంథాలయానికి మహర్దశ పట్టనుంది. ఇటీవల గ్రంథాలయ భవన దుస్థితిపై ‘చరిత్ర ఘనం..సౌకర్యాలు కనం’ శీర్షికన ఈ నెల 8వ తేదీన ఈనాడులో ప్రచురితమైంది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కోదాడ మండలం నల్లబండగూడెంలోని ఫోరస్‌ ల్యాబోరేటరీస్‌

Published : 23 Jan 2022 05:41 IST

దాతల సాయంతో రూ. 45 లక్షలతో నూతన భవనం


గ్రంథాలయంలో మాట్లాడుతున్న దొడ్డా నారాయణరావు

చిలుకూరు, న్యూస్‌టుడే: బాపూజీ గ్రంథాలయానికి మహర్దశ పట్టనుంది. ఇటీవల గ్రంథాలయ భవన దుస్థితిపై ‘చరిత్ర ఘనం..సౌకర్యాలు కనం’ శీర్షికన ఈ నెల 8వ తేదీన ఈనాడులో ప్రచురితమైంది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కోదాడ మండలం నల్లబండగూడెంలోని ఫోరస్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థతో మాట్లాడారు. అంతకు ముందు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సైతం నిధులు ఇవ్వాలంటూ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న ఫోరస్‌ సంస్థ నూతన భవనం నిర్మించేందుకు తమ వంతుగా రూ. 25 లక్షలు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు ఈనెల 20 తేదిన సంస్థ ప్రతినిధులు గ్రంథాలయ అభివృద్ధి కమిటీకి ఓ లేఖ రాశారు. శనివారం ఈ విషయంపై స్థానిక గ్రంథాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మరి కొందరు దాతలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. జడ్పీటీసీ సభ్యురాలు బొలిశెట్టి శిరీష.. జడ్పీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు రూ.5 లక్షలు సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ బండ్ల ప్రశాంతికుమారి మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. ఇలా మొత్తం రూ.45 లక్షలతో నూతన భవన నిర్మాణం చేయించాలని సమావేశంలో తీర్మానించారు.  పాత భవనం కూల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తకాలను భద్రపరిచేందుకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గది ఇవ్వాలని కోరారు. ఇన్‌ఛార్జి సర్పంచి కొడారు వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ అంబాల వెంకటి, అఖిలపక్ష నాయకులు కస్తూరి నర్సయ్య, దొడ్డా సురేశ్‌బాబు, అలసకాని జనార్ధన్‌, పిల్లుట్ల కృష్ణయ్య, బెల్లంకొండ నాగయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని