logo

నైపుణ్య శిక్షణ.. ఉపాధికి రక్షణ

స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటే.. భవిష్యత్తు ఉజ్వలంగా సాగుతుంది. అందుకే మహిళలు, యువతీయువకులకు వృత్తి నైపుణ్యంపై మెలకువలు అందించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన

Published : 23 Jan 2022 05:53 IST

వాసాలమర్రిలో వృత్తి నైపుణ్య శిక్షణకు హాజరైన మహిళలు

తుర్కపల్లి, న్యూస్‌టుడే: స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటే.. భవిష్యత్తు ఉజ్వలంగా సాగుతుంది. అందుకే మహిళలు, యువతీయువకులకు వృత్తి నైపుణ్యంపై మెలకువలు అందించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కుట్టు, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ (ఎంఎస్‌ ఆఫీసు), ఎలక్ట్రిషియన్‌, మొబైల్‌ సర్వీసింగ్‌ రంగాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్‌లో మొత్తం 151 మంది పలు కోర్సుల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్ష తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు.
ఉత్తీర్ణులకు ధ్రువపత్రాల జారీ: ధనుంజయ్‌, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి... వాసాలమర్రి గ్రామంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 49 మంది కుట్టు, 29 మంది బ్యూటీషియన్‌, 20 మంది ఎలక్ట్రిషియన్‌, 15 మంది మొబైల్‌ సర్వీసింగ్‌, 30 మంది యువతీ యువకులు కంప్యూటర్‌ శిక్షణ పొందారు. వారికి త్వరలో పరీక్షలు నిర్వహిస్తాం. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు జారీ చేస్తాం.


బ్యూటీషియన్‌ రంగానికి మంచి డిమాండ్‌: పలుగుల ప్రశాంతి, బీటెక్‌

బీటెక్‌ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లల కారణంగా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్‌లో తర్ఫీదు పొందాను. మంచి డిమాండ్‌ ఉన్న బ్యూటీషియన్‌ రంగంలో రాణించి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటాను.


ఎంఎస్‌ ఆఫీసు నేర్చుకున్నా: కొక్కొండ నాగరాణి, డిగ్రీ

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలే కాకుండా అనేక సంస్థల్లోనూ కంప్యూటర్‌ ప్రాధాన్యం పెరిగింది. అందుకే శిక్షణ కేంద్రంలో కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీసు నేర్చుకున్నా. భవిష్యత్తులో ఎక్కడైనా పనిచేయగలననే నమ్మకం కలిగింది. ఉచిత శిక్షణ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పరీక్ష రాసి ధ్రువపత్రం పొందుతాను.


శిక్షణతో భవిష్యత్తుపై భరోసా: పలుగుల లావణ్య, ఇంటర్‌

నేర్చుకున్న వృత్తి విద్య భవిష్యత్తుపై భరోసానిస్తోంది. కేంద్రంలో జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు, ఫ్రాక్‌లు, చిన్న పిల్లల షర్టులు, నిక్కర్లు కుట్టడం నేర్పించారు. సొంతంగా ఇంట్లోనే ఉంటూ దర్జీ షాపు నడిపిస్తా. నా వంతు బాధ్యతగా స్వశక్తితో డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలుస్తా.


కుటుంబానికి ఆసరాగా నిలుస్తా: దుబ్బాక రాధిక

వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి రావటం నాకు మేలు జరిగింది. మార్కెటింగ్‌ రంగంలో పని చేస్తూ నా భర్త మాకోసం నిత్యం చాలా కష్టపడుతున్నారు. ఇద్దరం కష్టపడితేనే సంతోషంగా ఉంటాం. అందుకే శిక్షణ కేంద్రంలో ఇక్కడ పలు రకాల జాకెట్లు, చిన్న పిల్లలు, పెద్దలు దుస్తులు, పంజాబీ డ్రెస్సులు కుట్టడం నేర్చుకున్నాను. కోర్సు పూర్తయ్యింది. త్వరలో టైలరింగ్‌ షాపు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని