logo

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలి

తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో ప్రకటించిన ప్రకారం హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వరుసలతో ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించాలని పార్లమెంట్‌లో కొట్లాడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 23 Jan 2022 05:53 IST

లక్కారంలో మృతదేహాలకు నివాళి అర్పిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తదితరులు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో ప్రకటించిన ప్రకారం హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వరుసలతో ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించాలని పార్లమెంట్‌లో కొట్లాడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వారం వ్యవధిలో ఈ రహదారిపై ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన తండ్రీకుమారులు డాకోజీ రామకృష్ణ, ఈశ్వరసాయిల మృతదేహాలకు లక్కారంలో శనివారం ఆయన నివాళి అర్పించారు. బంధువులను ఓదార్చారు. కుటుంబానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల విభజన పూర్తయి ఏడేళ్లయినా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించిన ప్రకారం సమాంతరంగా మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో పర్యాయాలు దిల్లీ వెళ్లినా ఒక్క సారైనా విభజన చట్టంలో పేర్కొన్న ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం చేయించాలని ప్రధానిని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు ఆరోగ్యశ్రీ లేకుండా చేశారన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చు రూ.1000కి మించితే ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీని పునరుద్ధరించాలని, మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక కౌన్సిలర్లు కొయ్యడ సైదులు, కాసర్ల మంజుల, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఉప్పు భద్రయ్య, ఆవుల యేసు, మొగుదాల రమేశ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని