logo

జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హుజూర్‌నగర్‌ ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. జాన్‌పహాడ్‌ దర్గా ఆవరణలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు.

Published : 23 Jan 2022 05:53 IST

మాట్లాడుతున్న ఆర్డీవో వెంకారెడ్డి, పక్కన డీఎస్పీ రఘు, తదితరులు

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హుజూర్‌నగర్‌ ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. జాన్‌పహాడ్‌ దర్గా ఆవరణలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలతో హాజరు కావాలని భక్తులకు సూచించారు. గతేడాది పార్కింగ్‌, విద్యుత్తు దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్‌జామ్‌ లాంటి మౌలిక వసతులు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అసౌకర్యాలు కలగకుండా ప్రణాళికతో ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులనూ ఆర్డీవో ఆదేశించారు. వక్ప్‌ బోర్డు అధికారులకు ఆదాయార్జనపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై లేదని, వారి సహకారం లేకుండా ఏర్పాట్లు చేయటంతో గ్రామ పంచాయతీపై ఆర్థిక భారం పడుతోందని సర్పంచి రమావత్‌ గోరీ అన్నారు. గత ఉర్సు వేడుకలకు రూ.3 లక్షలు జీపీ సాధారణ నిధులు నుంచి ఇస్తే.. నేటి వరకు తిరిగి జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్గా ఆవరణలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతి శాఖకు సంబంధించిన అధికారి ఒకరు అందుబాటులో ఉండాలని డీఎస్పీ రఘు సూచించారు. బందోబస్తు కోసం 300 మందికి పైగా సిబ్బంది ఉంచినట్లు తెలిపారు. శౌచాలయాలు, తాగునీటి ఏర్పాటు ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ప్రత్యేక సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని వక్ప్‌బోర్డు అధికారులను కోరారు. శూన్యపహాడ్‌, జాన్‌పహాడ్‌ రహదారుల వెంట పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య శాఖ మూడు శిబిరాలు, మిర్యాలగూడ, కోదాడ డిపోల నుంచి బస్సులు నడుపుతామని ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. వక్ఫ్‌ బోర్డు అధికారి షేక్‌ మహమూద్‌, ఎంపీపీ భూక్యా గోపాల్‌, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు బుజ్జి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు కవిత, సీఐ రామలింగారెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారిణి జయ, ఎంపీడీవో జానయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ మహిపాల్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ శ్యామ్‌సుందర్‌, అగ్నిమాపక అధికారి రామలింగం పాల్గొన్నారు.

20 ప్రత్యేక బస్సులు

మిర్యాలగూడ పట్టణం : ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జానపహాడ్‌ ఉర్సుకు మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ బొల్లెద్దు పాల్‌ తెలిపారు. ఇటీవల పెంచిన కార్గో ఛార్జీలు ప్రజల కోరిక మేరకు తగ్గించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని