logo
Updated : 24 Jan 2022 02:50 IST

వేర్వేరుగా ఇద్దరు బలవన్మరణం

మృతుడు ఎలగందుల మహేష్‌

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: అనారోగ్యం కారణంతో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదగిరిగుట్ట పట్టణ శివారులో విద్యుత్తు తీగలు పట్టుకొని మహేంద్ర కుమార్‌ ప్రాణాలు తీసుకోగా.. గుండాల మండలంలో యువకుడు ఎలగందుల మహేష్‌ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి దేవస్థాన అభివృద్ధి పనులు చేయడానికి రాజస్థాన్‌లోని గోత్ర భూక్రాన్‌ గ్రామం నుంచి మహేంద్ర కుమార్‌ (38), అతని అన్నకుమారుడు మనోజ్‌కుమార్‌, మరికొందరు కూలీలతో కలిసి ఈ నెల 28న యాదగిరిగుట్టకు వచ్చారు. పట్టణ శివారులోని మల్లాపురం రహదారి పక్కన శిబిరం ఏర్పాటుచేసుకొని సహచరులతో కలిసి యాదాద్రి కొండపైకి పనులు వెళ్లేవారు. వైద్యం చేయించుకున్నా.. ఆరోగ్యం కుదుట పడకపోవడంతోపాటు అటు కుటుంబానికి దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కనిపించకుండా పోయారు.. ఆ శిబిరానికి కొంత దూరంలో ఉన్న విద్యుత్తు నియంత్రిక కింద మహేంద్రకుమార్‌ విగతజీవిగా కనిపించడంతో పశువుల కాపరి ఆవుల కృష్ణ గమనించి, అతని సహచర కూలీలకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్తు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యుత్తు నియంత్రిక గద్దె ఎక్కి కరెంటు తీగలు పట్టుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతుని అన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.

రామారంలో... గుండాల: మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎలగందుల మహేష్‌(26) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యారు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద ఎవరూ లేని సమయంలో మహేష్‌ పురుగు మందు తాగారు. బావి దగ్గరికి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో అక్కడికి వెళ్లిన తండ్రి మల్లయ్య.. మంచంపై విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

తిప్పర్తి, న్యూస్‌టుడే: అనిశెట్టిదుప్పలపల్లి గ్రామం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ(45) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామంలో గత వారం రోజులుగా గుర్తుతెలియని మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతంలో నివసిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మిర్యాలగూడెం వైపు వెళ్లే రహదారిపై నడుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు గ్రామంలో భిక్షాటన చేసే సమయంలో కన్నడ భాషలో మాట్లాడుతుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. శవపరీక్ష అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి శవగారంలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. బంధువులు, తెలిసిన వారు ఎవరైనా గుర్తుపడితే తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సత్యనారాయణ కోరారు.

ధర్మోజిగూడెం స్టేజీ వద్ధ..

చౌటుప్పల్‌ గ్రామీణం: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ధర్మోజిగూడెం స్టేజీ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన రూపాని రాములు(43) హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారి దాటుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును మెరుగైన చికిత్స నిమిత్తం నల్గొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములు మృతి చెందినట్లు తెలిపారు.


నీటికుంటలో పడి మహిళ మృతి

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్‌ కాలనీ ప్రాతంలో ఉన్న నీటి కుంటలో పడి మహిళ మృతి చెందినట్లు రూరల్‌ ఎస్సై గోపాల్‌రావు తెలిపారు. మాన్యం చల్కకు చెందిన మాతంగి అఖిల(30) కొద్ది రోజులుగా మతిస్థితిమితం సరిగా లేక తల్లిగారి ఇల్లు అయిన కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో ఉంటుంది. తల్లితో కలిసి నల్గొండకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో అఖిల తప్పిపోయింది. మార్గమధ్యలో ఉన్న కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. రోడ్డు వెంట వెళ్తున్న వారు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆసుపత్రికి తరలించి మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని