logo

ప్రత్యేకతల మణిహారం..ప్రపంచం మెచ్చిన గ్రామం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాలు ఉన్నాయి. ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి నారసింహ ఆలయం పునర్నిర్మాణం పూర్తి కావొస్తుంది. మగువలు మెచ్చే పట్టుచీరల నిలయం పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచం మెచ్చింది. నాగార్జునసాగర్‌, బుద్ధవనం, నాగార్జున కొండ, కొలనుపాక జైనమందిరం.. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి

Published : 25 Jan 2022 04:41 IST

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం
భూదాన్‌పోచంపల్లి, నాగార్జునసాగర్‌, ఆలేరు, న్యూస్‌టుడే

పోచంపల్లి పట్టుచీరలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాలు ఉన్నాయి. ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి నారసింహ ఆలయం పునర్నిర్మాణం పూర్తి కావొస్తుంది. మగువలు మెచ్చే పట్టుచీరల నిలయం పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచం మెచ్చింది. నాగార్జునసాగర్‌, బుద్ధవనం, నాగార్జున కొండ, కొలనుపాక జైనమందిరం.. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. మంగళవారం జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.  
పచ్చని ఆహ్లాదపరిచే గ్రామీణ వాతావరణం.. ఈ అంశాలే ఆధారంగా పోచంపల్లి ప్రపంచ స్థాయిలో అందరిని ఆకట్టుకుంది. ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంది. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు, కనీసం సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి ప్రభుత్వానికి, ప్రజలకు ఆర్థికపరిపుష్టి చేకూరుతుంది.
ఆన్‌లైన్‌లోనే ఎక్కువ విక్రయాలు... మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులకు, అలవాట్లకు అనుగుణంగా చేనేత కళాకారులు, వ్యాపారులు, యువత అన్‌లైన్‌ ద్వారా నేరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మలేషియా, అమెరికా, సింగపూర్‌, లండన్‌, జర్మనీ, అస్ట్రేలియా వంటి దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు.


చేనేత పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలి: పట్నం కృష్ణకుమార్‌, భూదాన్‌పోచంపల్లి
చేనేత వస్త్రాల తయారీని తెలిపే పరిశోధన కేంద్రం, ఆభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయంగా సహజ రంగులతో తయారు చేసిన వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.సహాజరంగుల మొక్కలతో బొటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసి వస్త్రాలను తయారు చేయాలి.


ఆధ్యాత్మిక కేంద్రం కొలనుపాక
కొలనుపాక ఆరాధన క్షేత్రంగా ఉంది. ఇక్కడి ఆలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. జైన, హిందు, వైష్ణవ, వీరశైవ మతాలకు పుట్టినిల్లుగా విలసిల్లుతోంది. నిత్యం పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. జైన దేవాలయం క్రీ.శ.640లో నిర్మితమైంది. మహావీరుడు, వృషభదేవ్‌, నేమినాథ్‌, ఆదినాథ్‌ మూర్తులు కొలువై ఉన్నారు. దేశం నలుమూలల నుంచి జైనులు, మార్వాడీలు తరలి వస్తుంటారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన సోమేశ్వరస్వామి ఆలయం ఇక్కడ ఉంది. లింగోద్భవుడు, రేణుకాచార్యులు కొలువై ఉన్నారు.


కొండపై కోట..సందర్శకుల బాట

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏకశిల కొండపై ఉన్న చారిత్రక కట్టడం భువనగిరి కోట సందర్శకులను ఆకట్టుకుంటోంది. దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఏకశిలపై నిర్మించిన కోటను చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రతి శని, ఆదివారాలు యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహాస్వామి దర్శనానికి వచ్చే భక్తులు, యువతీయువకులు గుట్టపై వెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నా రు. దూరంనుంచి చూస్తే కింద భువనగిరి పట్టణం, నివాసాలు, కొండపైన రాజుల కోట సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

 - ఈనాడు, నల్గొండ


బుద్ధవనం ఖ్యాతి ఘనం..

బుద్ధ వనంలోని మహాస్తూపం

సాగర్‌లో ఉన్న ప్రధాన డ్యాం, ప్రధాన విదుత్కేంద్రం, నాగార్జునకొండ పర్యాటకులు చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని తిలకించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తుంటారు. సాగర్‌ డ్యాం, విద్యుత్కేంద్రంలోకి అనుమతి లేకపోవడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
బుద్ధవనం... సాగర్‌ హిల్‌కాలనీ వద్ద నిర్మిస్తున్న బుద్ధవనం ప్రపంచంలోనే పెద్దదైన థీమ్‌ పార్కులో 270 ఎకరాల్లో బౌద్ధమతానికి సంబంధించిన విషయాలను తెలిపేందుకు పలు నిర్మాణాలు చేశారు. బుద్ధుని జీవిత చరిత్ర పూర్తిస్థాయిలో పర్యాటకులకు అర్థమయ్యేలా ఇందులో 8 పార్కులు ఏర్పాటు చేశారు. ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
మూతపడిన నాగార్జునకొండ... సాగర్‌ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జునకొండను తప్పకుండా తిలకిస్తారు. నాలుగేళ్ల క్రితం గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదం కారణంగా నాగార్జునకొండకు లాంచీ ప్రయాణాన్ని నిలిపివేశారు. నాగార్జునకొండకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తితో వెళ్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని