logo

అతివలు కలిసి.. ఉపాధితో మెరిసి

కరోనా ప్రభావంతో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతటి సంక్షోభంలోనూ నల్గొండ పట్టణంలోని చర్లపల్లికి చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Published : 25 Jan 2022 04:44 IST

శానిటరీ న్యాప్‌కిన్‌ తయారీలో రాణిస్తున్న మహిళలు

ఇంట్లోనే నెలకొల్పిన శానిటరీ న్యాప్‌కిన్‌ ప్యాడ్ల యూనిట్‌

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంతటి సంక్షోభంలోనూ నల్గొండ పట్టణంలోని చర్లపల్లికి చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బ్యాంకు ద్వారా రుణం తీసుకొని మహిళలకు సంబంధించిన శానిటరీ వస్తువులు తయారీ యూనిట్‌ నెలకొల్పారు. స్వయంగా తయారీ, మార్కెంటింగ్‌ చేస్తూ ఆర్థికంగా బాటలు పర్చుకుంటూ, మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూన్నారు.

ప్రగతి బాటలో మహిళలు..
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లికి చెందిన లక్ష్మిగణపతి సమభావన సంఘం సభ్యురాలు సీహెచ్‌ జ్యోతి, వినాయక సెల్ప్‌హెల్ప్‌ గ్రూపు సభ్యురాలు విజయ  సుమారు రూ.4లక్షల వ్యయంతో 2021లో చిన్నతరహా పరిశ్రమగా మహాలక్ష్మి సంస్థ పేరుతో శానిటరీ న్యాప్‌కిన్‌ ప్యాడ్‌ వంటి వస్తువల తయారీ యూనిట్‌ నెలకొల్పారు. దిల్లీ, పచ్చిమబంగ్లా నుంచి ముడి సరకులు తీసుకొచ్చి మహిళలే స్వయంగా తయారు చేస్తున్నారు. ప్రత్యేకంగా ‘మై ఛాయిస్‌’ బ్రాండ్‌తో ప్యాకింగ్‌ చేసిన న్యాప్‌కిన్‌ ప్యాడ్లను తయారు చేస్తున్నారు. నల్గొండ, నార్కట్‌పల్లి, నకిరేకల్‌ పట్టణాల్లోని దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ప్రారంభంలో మార్కెటింగ్‌ చేయడంతో కాస్త ఒడిదొడుకులు ఎదురైనా ఆ తర్వాత పరిచయాలు పెరగడంతో కరోనా సమయంలోనూ మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యాపారం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఖర్చులన్ని పోను ఒక్కొక్కరూ ప్రతి నెల రూ. 15వేల వరకు సంపాదిస్తూ ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే యూనిట్‌ స్థాయి పెంచి వ్యాపారాన్ని విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు.


కరోనా సంక్షోభంలో ఇబ్బంది పడేవాళ్లం
-చెరుపల్లి జ్యోతి, లక్ష్మిగణపతి సమభావన సంఘం సభ్యురాలు

పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టేవాళ్లం. కరోనాతో టైలరింగ్‌పై ప్రభావం పడింది. పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. కుటుంబం సాఫీగా సాగాలంటే నిత్యం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వస్తువులను గుర్తించి లాభసాటి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాం. శానిటరీ నాప్‌కిన్‌ ప్యాడ్‌ పరిశ్రమను ఏర్పాటు చేశాం. ఇప్పుడు వ్యాపారం బాగా సాగుతోంది. మాతోపాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నాం.


దుకాణాలకు సరఫరా
-విజయ, వినాయక సెల్ప్‌ హెల్ప్‌గ్రూపు సభ్యురాలు

తయారు చేస్తున్న శానిటరీ నాప్‌కిన్‌ ప్యాడ్లను జిల్లా కేంద్రమైన నల్గొండతోపాటు చుట్టుపక్కల మండలంలోని దుకాణాలకు విక్రయిస్తున్నాం. మార్కెటింగ్‌ కోసం మా కుటుంబ సభ్యుల్లోనే కొంత మందిని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాం. దాని ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తే వ్యాపారాన్ని విస్తరించి మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాం.




 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు