logo

నిలిచిన పథకం.. చేకూరని ప్రయోజనం

పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాడి పశువుల పంపిణీ పథకం అర్థాంతరంగా నిలిచిపోయింది. భారీ రాయితీతో ఈ పథకాన్ని 17 సెప్టెంబర్‌ 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా అప్పట్లో ప్రభుత్వమే ఈ పథకానికి నిధులు సమకూర్చింది

Published : 25 Jan 2022 04:59 IST

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాడి పశువుల పంపిణీ పథకం అర్థాంతరంగా నిలిచిపోయింది. భారీ రాయితీతో ఈ పథకాన్ని 17 సెప్టెంబర్‌ 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా అప్పట్లో ప్రభుత్వమే ఈ పథకానికి నిధులు సమకూర్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు మరో మూడు జిల్లాల్లో పాలను సేకరిస్తున్న నార్ముల్‌ డెయిరీ పాల ఉత్పత్తిదారుల్లోని 20049 మంది పాడి రైతులను ఎంపిక చేసి ఐదు నెలల వ్యవధిలో పాడి పశువులను పంపిణీ చేయాలన్నది పథకం లక్ష్యం. ప్రభుత్వ నిర్ణయం అమలుకు నేటికీ నోచుకోలేదు. ప్రభుత్వ నిర్ణయంతో పాడి పశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ పథకం నిలిచిపోవడంతో పాడి రైతుల్లో నిరాశ నెలకొంది.

లక్ష్యం సాధించని పథకం... పాడి పశువుల పంపిణీ పథకం లక్ష్యం సాధించకుండానే అటకెక్కింది. కేవలం 6635 మందికి పథకం ప్రయోజనం చేకూర్చి పథకాన్ని నిలిపివేయడం గమనార్హం. దీంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. భారీ రాయితీతో పాడి గేదెలు పొందుతామన్న రైతుల ఆశలు నెరవేరలేదు. పథకం దక్కని రైతుల బాధ ఒకలాగ ఉంటే, లబ్ధిదారుల ఆవేదన మరోలా ఉంది. 6635 గేదెల్లో ఇప్పటి వరకు వాతావరణం అనూకూలించక, ఇతర కారణాలతో ఇప్పటి వరకు 440 గేదెలు మృతి చెందాయి. వీటికి బీమా పరిహారం రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.80 వేలు యూనిట్‌ ధర నిర్ణయించిన సందర్భంలోనే రవాణా, బీమా ఖర్చుల నిమిత్తం రూ.10వేలను యూనిట్‌ విలువ నుంచి మినహాయించి రెండు సదుపాయాలు కల్పించడం గమనార్హం. బీమా కింద ఇప్పటి వరకు 62 గేదెలను ఇప్పించినప్పటికీ వాటికి నేటికీ బీమా పత్రం ఇవ్వకపోవడం గమనార్హం. ఇందులో కొందరి గేదెలు మృతి చెందాయి. 315 బీమా క్లైంలు మంజూరయ్యాయని చెబుతున్న అధికారులు నేటికీ బీమా పరిహారం ఇప్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గేదెలు మృతి చెంది నష్టపోయిన తమకు బీమా పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పథకం అమలు ఇలా.... అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పథకాన్ని అమలు చేసేందుకు నాడు అధికారులు చర్యలు చేపట్టారు. గేదెలు కొనుగోలు విషయంలో లబ్ధిదారుడికి పూర్తి స్వేచ్ఛను అధికారులు ఇచ్చారు. పాల ఉత్పత్తిదారుల సంఘాల్లో ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇష్టమున్న ప్రాంతంలో ఆవులు, గేదెలు కొనుగోలు స్వేచ్ఛను ఇచ్చారు. పథకం యూనిట్‌ విలువలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం రాయితీపై, ఇతరులకు 50 శాతం రాయితీపై గేదెలను అందించారు. దాణా ఖర్చుల కింద రూ.5000 మంజూరు చేశారు. రూ.5140, మూడేళ్లపాలు బీమా కోసం మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు తమ వాటా కింద చెల్లించాల్సి ఉన్న రూ.20వేలతో పాటు ప్రభుత్వం రూ.60 వేలు సమకూర్చింది. ఇతరులకు రూ.40వేలు రాయితీ కింద ప్రభుత్వం గేదెలను సమకూర్చింది. లబ్ధిదారుడు తన వాటా కింద మరో రూ.40వేలు చెల్లించారు.


ప్రభుత్వ నిర్ణయం మేరకు పంపిణీ
-డాక్టర్‌ కృష్ణ, జిల్లా పశువైద్య, సంవర్థకశాఖాధికారి

ప్రభుత్వ నిర్ణయం మేరకు అప్పట్లో డీడీలు చెల్లించిన 6635 మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం పథకం అమలులో లేదు. గేదెలు చనిపోయిన రైతులకు నిబంధనల మేరకు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నాం. 315 మందికి బీమా క్లైంలు మంజూరయ్యాయి. విడతల వారీగా బీమా పరిహారం కింద గేదెలు అందజేస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని