logo

ఓటు..మీ అస్త్రం

ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించే వారికి ఇదొక ఆయుధం. ఈ ఆయుధమెప్పుడు పదునుతోనే ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాకాంక్ష నెరవేరుతుంది. దీనికి బీజం పడాల్సింది ఓటు హక్కు ఊపిరి పోసుకున్నప్పుడే. అది 18 ఏళ్లు నిండగానే సాధ్యమవుతుంది

Published : 25 Jan 2022 05:25 IST

మేళ్లచెరువు, నేరేడుచర్ల, న్యూస్‌టుడే

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రజాస్వామ్య దేశంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు మాత్రమే. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించే వారికి ఇదొక ఆయుధం. ఈ ఆయుధమెప్పుడు పదునుతోనే ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాకాంక్ష నెరవేరుతుంది. దీనికి బీజం పడాల్సింది ఓటు హక్కు ఊపిరి పోసుకున్నప్పుడే. అది 18 ఏళ్లు నిండగానే సాధ్యమవుతుంది. అప్పటి నుంచి ఊపిరి ఉన్నంతవరకు ఓటు అనే ఆయుధానికి పదును ఉండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటారు.  కానీ.. చాలామంది ఓటు ప్రాధాన్యతను చాలా తక్కువ చేసి చూస్తుంటారు. రాజకీయ పార్టీల పేరుతో నాయకులు ఓటుకు డబ్బుతో విలువ కడతారు. ఓటరు మానసిక స్థితిని ఈ విధంగా లొంగదీసుకుంటారు. మన జిల్లా ఓటర్లు, కొత్త ఓటర్లలో చైతన్యం ఉందనే చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చెప్పక్కర్లేదు. కొత్త ఓటర్ల నమోదులోనూ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాలే ముందున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త జాబితా ప్రకారం.. 26,99,217 మంది ఓటర్లున్నారు. ఇందులో యువ ఓట్లే 17,811 ఉన్నాయి. వీరు గనుక లోతుగా ఆలోచిస్తే.. సొంత ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు కుటుంబంలో ఉన్న మిగతా వారినీ ప్రభావితం చేయగల సత్తా వీరిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఈ ఓటు ఆయుధం మునుముందు రోజుల్లో ఇంకా పదునెక్కాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. కొన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగాన్ని నిర్భంధం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 22 దేశాల్లో నిర్బంధ ఓటు హక్కు వినియోగం ఉంటుంది. తద్వారా ఫలితాలూ ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తున్నామని విశ్లేషకులు పేర్కొన్నారు.
జైలు శిక్ష: గ్రీస్‌, ఈజిప్టు దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుంటే జైలు శిక్ష నెల వరకు అనుభవించాల్సి ఉంటుంది. సహేతుక కారణాలు లేకుంటే ఇక్కడ ఆ నిబంధన ఉంది. ఇంతవరకు అక్కడెవరు శిక్షార్హులవ్వలేదు.
జరిమానా: బ్రెజిల్‌ దేశంలో ఓటు హక్కు వినియోగించుకోకుంటే జరిమానా విధిస్తారు. 18-70 ఏళ్ల వయసు వరకు విదేశాల్లో ఉన్నా ఆరోజు రావాల్సిందేనన్న నిబంధన అక్కడుంది.

కొన్ని దేశాల్లో..

పథకాలకు అనర్హులే: అర్జెంటీనాలో ఓటు హక్కు వినియోగించుకోని వారికి ఏడాది పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అనర్హులుగా పరిగణిస్తారు. ముందుగా విధించిన 50 డాలర్ల జరిమానా చెల్లించకపోతే ఈ నిబంధన అమలు చేస్తారు.


కొత్త ఓటరుకు శుభవార్త!
కొత్త ఓటర్లకు శుభవార్త. ఈ జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ఇంటికే వారి ఓటరు కార్డులు రానున్నాయి. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జనవరి 25 వరకు ఈ కార్డులు ఉమ్మడి జిల్లాలో 17, 811 మంది కొత్త ఓటర్ల చేతికి అందేలా భారత ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకుంది. స్పీడ్‌ పోస్టు ద్వారా ఈ ఓటరు స్మార్ట్‌ కార్డులను అందుకోబోతున్నారని అధికారులు తెలిపారు.  

ఒక్క ఓటుతో..
*    1850 లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది.
*    1990 లో ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.
*    2008 లో రాజస్థాన్‌ లో ఒక్క ఓటు తేడాతోనే ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సీపీ జోషినాథ్‌ సీఎం కాలేకపోయారు. జోషి తల్లి, భార్య, డ్రైవరు ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోలేదు.
*    నోటాకూ చాలా విలువ ఉంది. బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థులెవరూ నచ్చకుంటే నోటాకే ఓటేయొచ్చని ఈసీ పేర్కొన్న నేపథ్యంలో.. 2018 ఎన్నికల్లో నమోదైన 2.50 కోట్ల ఓట్లలో.. 2 శాతం ఓట్లు నోటా ఖాతాలోనే జమవడం విశేషం.


జిల్లాల వారీగా ఓటర్లు
జిల్లా పురుషులు స్త్రీలు థర్డ్‌ యువత జెండరు (18-19)
నల్గొండ 6,78,447 6,79,725 13 7,197
సూర్యాపేట 4,57,122 4,66,849 21 4,146
యాదాద్రి భువనగిరి 2,09,418 2,07,618 04 2,155

 



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని