logo

కత్తిపోట్లకు దారితీసిన ఆస్తి వివాదం

నాలుగు రోజుల్లో తల్లి దశదిన కర్మ చేయాల్సిన ఇంట్లో రక్తపుటేర్లు ప్రవహించాయి. ఆస్తి వివాదంలో అన్నదమ్ములిద్దరి మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. మతిస్తిమితం సరిగ్గాలేని వ్యక్తి తన బావ, సోదరుడిపై తల్వార్‌ (పెద్ద కత్తి)తో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఇస్తాళాపురంలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 25 Jan 2022 05:25 IST

సోదరుడు, బావపై విచక్షణారహితంగా దాడి

గ్రామస్థులు దాడిలో గాయపడ్డ నిందితుడు మర్రు చంద్రశేఖర్‌రావు
తమ్ముడు కత్తితో వేటు వేయడంతో గాయపడిన మర్రు హన్మంతరావు

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: నాలుగు రోజుల్లో తల్లి దశదిన కర్మ చేయాల్సిన ఇంట్లో రక్తపుటేర్లు ప్రవహించాయి. ఆస్తి వివాదంలో అన్నదమ్ములిద్దరి మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. మతిస్తిమితం సరిగ్గాలేని వ్యక్తి తన బావ, సోదరుడిపై తల్వార్‌ (పెద్ద కత్తి)తో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఇస్తాళాపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై యాదవేందర్‌రెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వృద్ధురాలు మర్రు యాదమ్మ వారం క్రితం చనిపోయారు. ఆమె దశదిన కార్యక్రమాలు చేసేందుకు కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. దిన కార్యక్రమం గురించి మాట్లాడుతున్న క్రమంలో సోదరులు సూర్యాపేటలోని సిద్ధార్థ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ మర్రు హన్మంతరావు, మర్రు చంద్రశేఖర్‌రావు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మానసిక పరిస్థితి సరిగ్గా లేని చంద్రశేఖర్‌రావు ఇంట్లో ఉన్న తల్వార్‌తో సోదరుడిపై దాడి చేశారు. అడ్డువచ్చిన బావ నేరేడుచర్ల మండలం దిర్శించర్లకు చెందిన గుమ్మడపు వెంకటేశ్వర్‌రావుపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తల, ముఖం, చేతులపై కత్తి వేట్లతో తీవ్రగాయాలపాలైన వెంకటేశ్వర్‌రావు రక్తపు మడుగులో పడిపోయారు. గ్రామస్థులు చంద్రశేఖర్‌రావును ఆపే ప్రయత్నం చేయగా వారిపైనా దాడి చేయబోయారు. గ్రామస్థులు పట్టుకొని చితకబాదటంతో అతడి కాలు విరిగినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా మారిన వెంకటేశ్వర్‌రావును చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. చంద్రశేఖర్‌రావు సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని