logo

ఉపసర్పంచుల అధికారాలకు కత్తెర

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచి, ఉప సర్పంచులకు సంయుక్తంగా (జాయింట్‌) చెక్‌ పవర్‌ ఉంది. కానీ కొన్ని చోట్ల ఉప సర్పంచులు ఉద్దేశపూర్వకంగా సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. పలు కారణాలను ప్రస్తావిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఉప సర్పంచులకు బదులుగా వార్డు సభ్యుల్లో ఒకరు సంతకం చేసేందుకు ఒకరిని ఎంపిక చేయడం ద్వారా ఉప సర్పంచుల చెక్‌ పవర్‌ మార్పు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ

Updated : 26 Jan 2022 05:53 IST

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచి, ఉప సర్పంచులకు సంయుక్తంగా (జాయింట్‌) చెక్‌ పవర్‌ ఉంది. కానీ కొన్ని చోట్ల ఉప సర్పంచులు ఉద్దేశపూర్వకంగా సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. పలు కారణాలను ప్రస్తావిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఉప సర్పంచులకు బదులుగా వార్డు సభ్యుల్లో ఒకరు సంతకం చేసేందుకు ఒకరిని ఎంపిక చేయడం ద్వారా ఉప సర్పంచుల చెక్‌ పవర్‌ మార్పు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. ఇందుకు గ్రామసభలో తీర్మానం చేసి దాన్ని కలెక్టర్‌ ఆమోదంతో అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్‌ పవర్‌ను స్థానిక ఇబ్బందుల దృష్ట్యా సభ్యులను మార్చుకోవచ్చునని పంచాయతీరాజ్‌ కమీషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ ఉండటంతో పలు పంచాయతీల్లో బిల్లుల చెల్లింపుల్లో సర్పంచి, ఉప సర్పంచుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఉప సర్పంచులు సంతకాలు చేసేందుకు పలు కారణాలను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో సకాలంలో జరగాల్సిన చెల్లింపులకు జాప్యమవుతుందని సర్పంచులు కమీషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పలు పంచాయతీల్లో సర్పంచి, ఉప సర్పంచి వేర్వేరు పార్టీలకు చెందిన వారున్న చోట బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. దీంతో గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల విడుదల, బకాయిల చెల్లింపు, వేతనాల జారీ తదితరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రత్యామ్నాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ఉప సర్పంచిపై వేటు

పెద్దవూర మండలం కుంకుడుచెట్టుతండా ఉప సర్పంచిని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సస్పెండ్‌ చేశారు. కుంకుడుచెట్టుతండా సర్పంచి రామావత్‌ ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులు ఉప సర్పంచి చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈనెల 2న హలియా-నాగార్జునసాగర్‌ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఎనిమిది నెలలు గడిచినా అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు దాదాపు రూ. 8,71,717 రావల్సి ఉండగా ఉప సర్పంచి రూ. 1,88,892కు చెక్కులపై సంతకాలు పెట్టి మిగతా డబ్బులకు సంతకాలు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సర్పంచి ఆరోపించారు. ఈ క్రమంలో పంచాయతీ అధికారులు విచారణ జరిపి నివేదికలు కలెక్టర్‌కు అందజేశారు. పరిశీలన చేసిన కలెక్టర్‌ ఉప సర్పంచిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పాలకవర్గాల్లో సభ్యుల మధ్య ఏర్పడుతున్న విబేధాలతో అవిశ్వాస తీర్మానాలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో చిత్తలూరు, ఇనుపాముల, ముడుదొడ్ల, పడమటిపల్లి పంచాయతీల్లో ఉప సర్పంచులపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గడంతో ఉప సర్పంచులు పదవీ నుంచి తొలగించడం జరిగింది. గూడపూర్‌ గ్రామ ఉప సర్పంచిపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా ఓటింగ్‌ సమావేశానికి ముందే రాజీనామా చేశారు. సూర్యాపేటలో పెదనేములు, నేలమర్రి, యాదాద్రి జిల్లాలో వీరరెల్లి, గొల్లగూడ గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొన్ని పంచాయతీల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేసిన తర్వాత సభ్యుల ఓటింగ్‌కు ముందే ఉప సర్పంచులు రాజీనామా చేసి పదవి నుంచి తొలగిపోయారు.

వివాదం పరిష్కారం కోసం

- దాసరి వెంకన్న, దోరేపల్లి ఉప సర్పంచి, కనగల్‌ మండలం

కొన్ని పంచాయతీల్లో సర్పంచి, ఉప సర్పంచి మధ్య సఖ్యత లేక బిల్లుల చెల్లింపులో వివాదాలు ఏర్పడుతున్నాయి. అలాంటి పంచాయతీల్లో వివాదాలను పరిష్కరించి సకాలంలో బిల్లులు చెల్లింపుతో పాటు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉప సర్పంచుల చెక్‌ పవర్‌లో మార్పు తెచ్చింది. అభివృద్ధిలో జాప్యాన్ని నివారించేందుకు మార్పు తేవడం ఆమోదంగానే ఉంది.

పాత పద్ధతిని కొనసాగించాలి

- కల్లూరి నగేశ్‌, ఉప సర్పంచి, పల్లివాడ

రామన్నపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేందుకు ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ను పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాలు సమర్ధనీయం కాదు. ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ మార్చే విధానంతో గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశముంది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు సక్రమంగా కేటాయించకుండా గ్రామ పంచాయతీల పాలకవర్గాల దృష్టి మళ్లించటానికి ప్రభుత్వం వేసిన కొత్త ఎత్తుగడగా ఈ మార్గదర్శకాలు కన్పిస్తున్నాయి. నూతన మార్గదర్శకాలతో గ్రామ సభలు రాజకీయ వేదికలుగా మారే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని