logo

న్యాయం జరగడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

తన కూతురి మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోగా.. పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ నిందితుడి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు

Published : 26 Jan 2022 04:40 IST

చికిత్స పొందుతున్న సరిత

వేములపల్లి, న్యూస్‌టుడే: తన కూతురి మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోగా.. పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ నిందితుడి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వేములపల్లి మండలం సల్కునూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు తుపాకుల సరిత వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో సరిత కూమార్తె ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివేది. ఓ రోజు అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో కళాశాలకు వెళ్లివస్తుండగా గ్రామానికి చెందిన బారి సైదులు అనే వ్యక్తి తన చరవాణిలో ఫొటోలు తీశాడు. లేనిపోని మాటలు చెప్పి నా కూతురిని అబాసుపాలు చేయడంతో కూతురుని మందలించామని, దీంతో గత డిసెంబర్‌ 7న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ అదేనెల 9న మృతిచెందిందని సరిత పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం తన కూతురు మృతికి గల అసలు విషయం తన భర్తకు తెలియడంతో భార్యభర్తలం కలిసి బారీ సైదులుపై వేములపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయగా.. స్థానిక ఎస్సై కేసు నమోదులో తాత్సారం చేశారని.. బారీ సైదులు విషయం తెలుసుకుని ఈ నెల 21 రాత్రి తన ఇంటివద్దకు వచ్చి ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే భార్యభర్తలను చంపుతానంటు బెదిరించాడని సరిత వెల్లడించారు. దీనిపై ఈ నెల 22న ఎస్సైకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో దంపతులిద్దరం దుఃఖంతో వెనుదిరిగి ఇంటికి వెళ్లగా నిందితుడు సైదులు మరోమారు వేధించాడని వాపోయారు. న్యాయం చేసేవారు లేరంటూ మానసిక వేదనకు గురై ఆత్మహత్యే శరణ్యమని భావించి పురుగు మందు తాగినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ప్రస్తుతం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రూరల్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని