logo

తెరాస జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రకుమార్‌

సుదీర్ఘకాలం తర్వాత అధికార తెరాస.. తమ పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సామాజిక సమీకరణాల నేపథ్యాలను అంచనా వేసి ఇప్పటికే పలు పదవుల్లో ఉన్నవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించారు. నల్గొండ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, సూర్యాపేటకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, యాదాద్రి భువనగిరికి ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డిని

Published : 27 Jan 2022 03:50 IST

ఈనాడు, నల్గొండ

సుదీర్ఘకాలం తర్వాత అధికార తెరాస.. తమ పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సామాజిక సమీకరణాల నేపథ్యాలను అంచనా వేసి ఇప్పటికే పలు పదవుల్లో ఉన్నవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించారు. నల్గొండ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, సూర్యాపేటకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, యాదాద్రి భువనగిరికి ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. మూడు జిల్లాలకు అప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిని కాదని, అనూహ్యంగా ఇప్పటికే ప్రజా పదవుల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారిని ఎంపిక చేయడం గమనార్హం. 2016 తర్వాత జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించడం తెరాసకు ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరులో గ్రామ, వార్డు, పట్టణ కమిటీలకు అధ్యక్షుల నియామకం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించాల్సి ఉన్నా దాదాపు మూడు నెలల విరామం అనంతరం అన్ని కోణాల్లో సమతూకం చేసి వీరిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అంచనాలకు అందకుండా
రానున్న ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎవరి అంచనాలకు అందకుండా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ పదవుల కోసం ఏళ్లుగా ఉద్యమంలో ఉండి, పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నవారు సైతం ప్రయత్నించగా.. అధిష్ఠానం ఎమ్మెల్యే, ఎంపీలనే అధ్యక్ష పదవులకు ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో క్యాడర్‌తో పాటూ వివిధ వర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసే దిశగా వీరు కృషిచేయాల్సి ఉంది. మూడు జిల్లాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల సామాజికవర్గాలకు చెందిన వారినే అధ్యక్షులుగా ఎంపిక చేయడం రాజకీయ వ్యూహంలో భాగమేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మూడు సార్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
దేవరకొండ మండలం రత్యా తండాకు చెందిన రమావత్‌ రవీంద్రకుమార్‌ ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 2004, 2014ల్లో సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీపీఐ నుంచి రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. అనంతరం వివిధ పరిణామాల నేపథ్యంలో 2016లో ఆయన తెరాసలో చేరారు. 2018లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నుంచి గిరిజన సామాజికవర్గానికి చెందిన వ్యక్తే జిల్లా అధ్యక్షుడిగా ఉండగా...అధికార పార్టీ సైతం అదే సామాజిక వర్గానికే చెందిన రవీంద్రకుమార్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని