logo

దళితబంధు పథకం కాదు.. సామాజిక మార్పు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లక్ష్యం నెరవేరే దిశగా లబ్ధిదారులు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) కార్యదర్శి స్మితా సబర్వాల్‌ కోరారు. దళితబంధు అసలు పథకం కాదని,

Published : 27 Jan 2022 03:50 IST

సమీక్షలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌

తుర్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లక్ష్యం నెరవేరే దిశగా లబ్ధిదారులు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) కార్యదర్శి స్మితా సబర్వాల్‌ కోరారు. దళితబంధు అసలు పథకం కాదని, ముఖ్యమంత్రి ఆలోచన నుంచి వచ్చిన ఒక విప్లవాత్మకమైన సామాజిక మార్పు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకొన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని దళితవాడలో బుధవారం స్మితా సబర్వాల్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ ఎ.శరత్‌, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో ‘దళిత బంధు’ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. దళితులు ఆర్థిక సాధికారత సాధించి ధనవంతులు కావాలనే ఆశయంతో సీఎం ఈ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికీ మంజూరైన రూ.10 లక్షలతో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.. ప్రగతి ఎలా ఉందని లబ్ధిదారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నామని, తామంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ‘మీరు బాగుపడటమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాల’ని స్మితా సబర్వాల్‌ ఆకాంక్షించారు. దళితబంధుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యామ్‌సుందర్‌ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆమె అభినందించారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలన్నీ సమకూరుతాయని చెప్పారు. వాసాలమర్రిని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయా శాఖల ఐఏఎస్‌ అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో కలిసి ఐఏఎస్‌ అధికారులు వీధుల్లో తిరుగుతూ.. గొర్రెల యూనిట్‌ పెట్టుకొన్న బొల్లారం రాములు, బొల్లారం లావణ్య (గేదెలు, వత్తుల తయారీ), గ్యార ఆండాళు (డోజర్‌), చిన్నూరి మానస కొనుగోలు చేసిన ట్రాలీ ఆటోను వారు పరిశీలించారు. సీఎం సార్‌ మా కోసం పెట్టిన పథకంతో చేతినిండా డబ్బులు సంపాదించుకుంటున్నట్లు లబ్ధిదారులు ఐఏఎస్‌ అధికారులకు వివరించారు. డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బీకునాయక్‌, సర్పంచి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఐఏఎస్‌ అధికారుల విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదిగేందుకు క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని