logo

క్రైమ్‌ వార్తలు

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనస్తాపంతో ఒకరు, అనారోగ్యంతో విద్యార్థిని, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 27 Jan 2022 03:50 IST

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనస్తాపంతో ఒకరు, అనారోగ్యంతో విద్యార్థిని, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మనస్తాపంతో ఒకరు..

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మనస్తాపంతో వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పానుగోలు లచ్చు(38) డ్రైవర్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. కొన్ని నెలల క్రితం మద్యం మత్తులో భార్య సునీతను హత్య చేశారు. ఈ కేసులో లచ్చు జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చారు. ఈ క్రమంలో భార్య సమీప బంధువులు లచ్చు, అతని సోదరులపై దాడి చేశారు. దీంతో తన కారణంగా తన కుటుంబ సభ్యులకు, తనకు గొడవలు కావడం ఇష్టం లేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు గ్రామీణ ఎస్సై-2 సుబ్బారెడ్డి తెలిపారు.


అనారోగ్యంతో విద్యార్థిని..

తుర్కపల్లి, న్యూస్‌టుడే: తుర్కపల్లి మండలానికి చెందిన విద్యార్థిని(17) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువున్న బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.


ఆర్థిక ఇబ్బందులతో..

సూర్యాపేట నేరవిభాగం: ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసగా మారి ఉరేసుకొని ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట బొడ్రాయిబజార్‌కు చెందిన షేక్‌ నాగుల్‌ మీరా (38) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవించేవారు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో రెండేళ్లుగా మద్యం తాగుతూ తిరుగుతున్నారు. బుధవారం సాయంత్రం భార్య, పిల్లలను ఇంట్లోంచి బయటకు పంపించి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని