logo

కలెక్టరేట్‌లో కలకలం

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎదుట ఓ రైతు తన సమస్య పరిష్కారానికి రెండో సారి ఆత్మహత్యకు యత్నించడం బుధవారం కలకలం రేపింది. కలెక్టరేట్‌ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై

Published : 27 Jan 2022 03:50 IST

రెండోసారి ఆత్మహత్యకు యత్నించిన రైతు

కలెక్టరేట్‌లో రైతు మహేశ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు

భువనగిరి, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎదుట ఓ రైతు తన సమస్య పరిష్కారానికి రెండో సారి ఆత్మహత్యకు యత్నించడం బుధవారం కలకలం రేపింది. కలెక్టరేట్‌ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడేనికి చెందిన బుడిగె మహేశ్‌ తండ్రి ఉప్పలయ్య పేరిట ఆలేరు మండలం కొలనుపాక శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. ఇందులో నాలుగెకరాలు పాస్‌పుస్తకంలో నమోదు కాలేదు. ఇందుకు 2006 నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, అప్పటి ఆలేరు తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ సర్వే చేసి కబ్జాలో ఉప్పలయ్యనే ఉన్నారని స్పష్టం చేశారని మహేశ్‌ తెలిపారు. ఆర్డీవో కోర్టులో ఉన్న ఈ కేసును ఇటీవలే కలెక్టర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌కు బదిలీ చేయగా అక్కడ కేసును కొట్టేశారని వెల్లడించారు. ఈ సమస్యపై మహేశ్‌ గత డిసెంబర్‌ 13న కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి పెట్రోల్‌ పొసుకున్నారు. గమనించిన సిబ్బంది తలుపులు పగులగొట్టి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత తహసీల్దార్‌, అదనపు కలెక్టర్‌ కలిసి ఉప్పలయ్య భూమి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు తమ సమస్య పరిష్కారం కాలేదని మహేశ్‌ బుధవారం మరోసారి ఆత్మహత్యకు యత్నించారు. కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు ముగిశాక కలెక్టర్‌ వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా వచ్చిన మహేశ్‌ సంచిలోంచి పెట్రోల్‌ డబ్బా తీసుకొని కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. తాము కొనుగోలు చేసిన భూమిని పాసుపుస్తకంలో నమోదు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం పోలీసులు మహేశ్‌ను ఠాణాకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని