logo

సలహాలు పాటిస్తూ.. లాభాలు గడిస్తూ..

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ తగిన పంటలు సాగుచేసి నష్టాల స్థానంలో లాభాలు గడించవచ్చునని నిరూపిస్తున్నారు ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నంద్యాలగూడెం, బోరింగ్‌తండావాసులు. ఈ రెండు గ్రామాలను జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ(క్రిడా)

Published : 27 Jan 2022 03:50 IST

ప్రకృతిని జయిస్తూ పంటలు పండిస్తున్న మహిళా రైతులు
ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే

బోరింగ్‌తండాలో ఆకుకూరల సాగులో గిరిజనులు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ తగిన పంటలు సాగుచేసి నష్టాల స్థానంలో లాభాలు గడించవచ్చునని నిరూపిస్తున్నారు ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నంద్యాలగూడెం, బోరింగ్‌తండావాసులు. ఈ రెండు గ్రామాలను జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ(క్రిడా) మూడేళ్ల క్రితం దత్తత తీసుకుంది. కరవు పరిస్థితుల్లో ప్రకృతిని ఎలా జయించాలో, ఏయే పంటలు వేసి ఆదాయం గడించాలో క్రిడాకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు శిక్షణ, సలహాలు అందించారు. ఉచితంగా వివిధ పంటల విత్తనాలు పంపిణీ చేశారు. పశువులకు టీకాలు వేయించడం, వ్యవసాయ పరికరాలు అద్దెకివ్వడం, చెక్‌డ్యాంలు, పంట కుంటల నిర్మాణం, చేపలు, కోళ్ల పెంపకం, బెట్ట పరిస్థితులను ఎదుర్కోవటం తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఫలితంగా ఈ రెండు గ్రామాల రైతులతోపాటు మహిళా రైతులు వ్యవసాయ రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు.


కూరగాయల పెంపకంతో రోజువారీ ఆదాయం
-గుగులోత్‌ మంగ్తీ, బోరింగ్‌తండా

మాకున్న ఐదెకరాల భూమిలో రెండు ఎకరాలు వరి, రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో కూరగాయల పంటలు సాగు చేస్తాం. కూరగాయల సాగు ఏడాది పొడవునా ఉంటుంది. ఈ పంటపై వచ్చే ఆదాయం ఇతర పంటలకు పెట్టుబడులుగా, ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతుంది. మాకు అధికారులు, శాస్త్రవేత్తలు కంది, పెసర, తదితర మెట్ట పంటల విత్తనాలు పంపిణీ చేశారు. పశువులకు టీకాలు వేశారు. ఎప్పుడు ఏ పంట వేయాలో మెలకువలు నేర్పారు.


కరవులోనూ బావుల్లో నీళ్లు దొరుకుతున్నాయి
-గుగులోత్‌ ఝాన్సీ, బోరింగ్‌తండా

శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వచ్చి మా తండాలో పెద్ద చెక్‌డ్యాం తవ్వించారు. వర్షాకాలంలో చెక్‌డ్యాం నిండితే మా బావుల్లో నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి. అంతకుముందు బావులు ఎండిపోయేవి. ఇప్పుడు సాగునీరు ఉండడంతో వివిధ రకాల పంటలు సాగు చేయగల్గుతున్నాం. ముఖ్యంగా ఐదుగుంటల విస్తీర్ణంలో కూరగాయల సాగుతో రోజుకు ఆదాయం రూ.1,000 వరకు వస్తుంది.


శాస్త్రవేత్తలు మెలకువలు నేర్పారు
-బీసు మైబూబ, నంద్యాలగూడెం

మల్బరీ సాగును ఐదేళ్లకుపైగా చేపట్టి పట్టుగూళ్లతో ఆదాయం గడించాం. రెండేళ్లుగా కూరగాయలు పండిస్తున్నాం. టమాట, బెండ, వంగ, ఇతర తీగజాతి, ఆకుకూరలు సాగుచేస్తున్నాం. దిగుబడిని సూర్యాపేట మార్కెట్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాం. నంద్యాలగూడెం కేంద్రంగా నిక్రా శాస్త్రవేత్తలు సాగులో నేర్పిన మెలకువలు అధిక దిగుబడులకు ఉపకరిస్తున్నాయి.


మల్బరీ సాగుతో అధికాదాయం
-నంద్యాల స్వప్న, నంద్యాలగూడెం

ఎనిమిదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నాం. అధికారులు నేర్పిన మెలకువలు, సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరి, పత్తి కంటే మల్బరీ సాగు లాభదాయకమైంది. మూడెకరాల్లో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి సుమారు ఎనిమిది పంటలు తీసి సరాసరి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని