logo

అసంతృప్త నేతలను కలుపుకెళ్తాం

రెండు దశాబ్దాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా తెరాసకు కంచుకోటగా ఉంది. రాష్ట్రంలో పార్టీకి పలు ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగిలినా ఇక్కడి ప్రజలు మాత్రం ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

Published : 28 Jan 2022 03:13 IST

తెరాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

రెండు దశాబ్దాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా తెరాసకు కంచుకోటగా ఉంది. రాష్ట్రంలో పార్టీకి పలు ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగిలినా ఇక్కడి ప్రజలు మాత్రం ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..

-ఈనాడు, నల్గొండ

లోటుపాట్లను చక్కదిద్దుతాం..
తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ ఏ బాధ్యత అప్పగించినా దానిని సంపూర్ణంగా నిర్వహిస్తున్నాను. అది చూసే సీఎం నన్ను ఈ పదవికి ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠానికి గత ఇరవై ఏళ్లుగా చేస్తున్న కృషి కారణంగానే పదవి వచ్చిందని భావిస్తున్నా. ప్రస్తుతం జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు పూర్తిగా మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. మునుగోడు మినహాయించి మిగతా వాటిల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. చారిత్రక ప్రదేశం అయిన భువనగిరిని మా ప్రభుత్వమే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్‌ యాదాద్రిని అద్భుత ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నారు. అన్నింటిలోనూ ప్రస్తుతం తెరాస బలంగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అన్నింటినీ చక్కదిద్దుతాం. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా చేర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో వీటిపై చర్చించనున్నాం.
సమన్వయంతో ముందుకు..
సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలందరినీ సమన్వయం చేస్తాం. అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీకి మరింత బలంగా మారేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సంస్థాగత పదవుల భర్తీ పూర్తయింది. అత్యధిక పదవుల్లో తెరాస నేతలే ఉన్నారు. వారిని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరింత భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే పదేళ్ల పాటు ఎన్నికలు ఏవి జరిగినా తెరాసనే విజయం సాధిస్తుంది.
సంక్షేమం.. అభివృద్ధి నినాదంతో
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పని అయిపోయింది. కాంగ్రెస్‌ రోజురోజకూ బలహీనపడుతోంది. ప్రజలకు ఈ ఏడేళ్లలో చేసిందేమిటో చెప్పడానికి భాజపా వద్ద సమాధానం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ వివిధ పార్టీల్లో మిగిలిపోయిన నాయకులు సైతం మా ప్రభుత్వ విధానాలు నచ్చి త్వరలోనే తెరాసలో చేరుతారన్న నమ్మకం ఉంది. వచ్చే రెండేళ్ల ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా గత ఏడేళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తాం. మా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని