logo

క్రయవిక్రయాలకు బారులు

ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇటీవల క్రయ విక్రయదారుల సందడి బాగా పెరిగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయ భూములు 50 శాతం, ఓపెన్‌ ప్లాట్లు 35 శాతం, బహుళ అంతస్తులు 25 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి.

Published : 28 Jan 2022 03:13 IST

ఉమ్మడి జిల్లాలో పెరిగిన రిజిస్ట్రేషన్లు

బీబీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ప్లాట్ల క్రయ, విక్రయదారుల సందడి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇటీవల క్రయ విక్రయదారుల సందడి బాగా పెరిగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయ భూములు 50 శాతం, ఓపెన్‌ ప్లాట్లు 35 శాతం, బహుళ అంతస్తులు 25 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు జిల్లాలకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం మరోసారి మార్కెట్‌ ధరలు పెంచుతున్నట్లు సమాచారం రావడంతో కొనుగోలు దారులు పాత ధరల్లో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గడిచిన ఏడాదిలో ప్రభుత్వం రెండు సార్లు ధరలు పెంచడంపై పేద, మధ్య తరగతి వారు భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందని కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పదిహేను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం పదింటిలో సర్వర్‌లు పనిచేయని కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో బాధితులు గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.అతి తక్కువగా మోత్కూరు 166, రామన్నపేట 182, చండూరు 236, రిజిస్ట్రేషన్లు అయ్యాయి. పెంచిన ధరలు అమల్లోకి రావడానికి మరో మూడ్రోజులు ఉన్నందున రిజిస్ట్రేషన్ల కోసం క్రయ విక్రయదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
సాధారణ రోజుల కన్నా ఎక్కువగా..
బీబీనగర్‌: బీబీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూములు, ప్లాట్ల విలువల పెంచేందుకు ప్రభుత్వం చర్చిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీబీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ప్లాట్ల క్రయ, విక్రేతల సందడి కనిపించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు మరింత గడువున్నప్పటికీ కొనుగోలుదారులు భూముల విలువ పెరుగుతోందని ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. బీబీనగర్‌లో సాధారణంగా రోజుకు 30 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతాయి. గురువారం ఒక్క రోజే 90 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని సబ్‌ రిజిస్ట్రార్‌ సతీష్‌ తెలిపారు.
భువనగిరి టౌన్‌: భువనగిరిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగే.. ఇందుకు భిన్నంగా ఈ నెల 25న 45 డాక్యుమెంట్లు, గురువారం రికార్డు స్థాయిలో 115 డాక్యుమెంటు రిజిస్టర్‌ అయ్యాయి. గురువారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి క్రయ విక్రేతలు భారీగా తరలి రావడంతో కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి.

 జాగ్రత్తలు తీసుకుంటున్నాం 
- ప్రవీణ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌

ప్రతి సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మార్కెట్‌ విలువలు పెరుగుతాయనే సమాచారముంది. కానీ ఏ ప్రాంతంలో ఎంత పెరుగుతుందనేది జిల్లాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశాలున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని