logo

జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు షురూ

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు వేడుకలు  గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు

Published : 28 Jan 2022 03:45 IST

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే

విద్యుత్‌ దీపాల కాంతులతో వెలుగులీనుతున్న దర్గా

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు వేడుకలు  గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు తెల్లవారుజామున గుసూల్‌ ఉర్సే షరీఫ్‌ ఆరంభమైనట్లు మత పెద్దలు తెలిపారు. దర్గా ముజావరు సయ్యద్‌ జానీ దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌ మొహినుద్ధీన్‌ జాన్‌పాక్‌ షహీద్‌ రహమతుల్లా అల్తె, సోదరుడి సమాధులపైనున్న పాత ఛాదర్లు, దట్టీలను తొలగించి సమాధులను నీటితో శుభ్రం చేయించారు. అనంతరం నూతన ఛాదర్లు, దట్టీలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి సైదన్న సమాధులను పూలు, గంధంతో యువరాజులా అలంకరించారు. గంధం సమాధులపైకి ఎక్కించే కార్యక్రమంలో ఫకీర్ల గానాలాపనలు హోరెత్తించాయి. మత పెద్దల సైదులు బాబా నామస్మరణల మధ్య గంధం ఎక్కించే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అనంతరం జల్సా ఈ సిరత్‌ అల్లా నమాజ్‌ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తదుపరి పాత ఛాదర్లు, దట్టీలను ఫకీర్ల ఖవ్వాళి గానాలాపనల మధ్య షపా బావి (పురాతన బావి)లో నిమజ్జనం చేశారు. దర్గా పరిసరాల్లో కొలువైన అమరుల సమాధులను సైతం అలంకరించారు. ఉదయం 7 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై కందూరు నిర్వహించి ఫాతేహాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. అన్నదాతలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పండిన కందులు, మినుములు, సజ్జలు, పెసర్లు, వరి ధాన్యంలొ కొంతభాగాన్ని సైదన్న స్వామికి సమర్పించి తమ పాడి పంటలను కాపాడాలని కోరుకొన్నారు.

భక్తుల వాహనాల నిలుపుదల ప్రదేశాలను  పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ప్రత్యేక ప్రార్థనలు

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వక్ఫ్‌బోర్డు కార్యాలయం నుంచి తెప్పించిన ప్రత్యేక పరిమళ గంధాన్ని కొద్దిమంది మత పెద్దల సమక్షంలో హజ్రత్‌ సయ్యద్‌ మొహినుద్ధీన్‌ జాన్‌పాక్‌ షహీద్‌ రహమతుల్లా అల్తె సమాధులకు ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

నేడు గంధం ఊరేగింపు

ఉత్సవాల్లో కీలకమైన పవిత్ర గంధోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య కనులపండువగా జరగనుంది. స్థానిక చందనఖానాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల సమక్షంలో మత పెద్దలు, వక్ఫ్‌బోర్డు అధికారులు ప్రత్యేక ఈద్‌ ఉల్‌ జుమా నమాజ్‌ నిర్వహించి పూర్వ జాన్‌పహాడ్‌ గ్రామ వీధుల్లో గుర్రాలపై ఊరేగింపు నిర్వహించి సాయంత్రం 4గంటల నమయంలో సైదులు బాబా సమాధులపైకి ఎక్కిస్తారు. ఈ సందర్భంగా తెరాస జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పవిత్ర గంధోత్సవానికి హాజరుకానున్నట్లు దర్గా వర్గాలు తెలిపారు.

పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

దర్గా ఉర్సు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ గురువారం తెలిపారు. ఆయన దర్గా పరిసరాలను పరిశీలించి మాట్లాడారు, 250 మంది సిబ్బంది, 22 మంది ఎస్సైలు, 4గురు సీఐలు, 50 మంది రోప్‌ పార్టీ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కోన్నారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సైదన్న స్వామి దర్శనం చేసుకొవాలని, 16 నిఘా నేత్రాల మధ్య పర్యవేక్షణ ఉంటుందన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని