logo

వసతులు భేష్‌.. ఫలితాలతో జోష్‌

నిరుపేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలలు అమ్మాయిలకు వరంలా మారాయి. ఇక్కడ చేరిన విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ

Published : 28 Jan 2022 03:45 IST

  ఆదర్శ ప్రాయంగా గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు

సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలలు అమ్మాయిలకు వరంలా మారాయి. ఇక్కడ చేరిన విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు మహిళా గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు గడువు ఉంది. దీని ద్వారా విద్యార్థినులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో సీట్లు, సదుపాయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
విద్యార్థినులకు వరం..
నల్గొండ జిల్లా కేంద్రం చర్లపల్లిలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, భువనగిరిలో ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌డ్‌ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, సూర్యాపేటలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 2,520 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా..ఆధునాతన వసతులున్నాయి. విశాలమైన తరగతి గదులతో పాటు ఆట స్థలం, గ్రంథాలయ సదుపాయాలు కల్పించారు. బోధన సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు అధ్యాపకులు నాణ్యమైన విద్యను అందిస్తూ వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు.
సౌకర్యాలు ఇవీ..
బీఏ హెచ్‌ఈపీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీకాం బిజినెస్‌ ఎనలైటిక్స్‌, ఎంపీసీ, డాటా సైన్సెస్‌, ఎంజడ్‌సీ, బీజడ్‌సీ తదితర కోర్సులు ఉండగా విద్యార్థినులకు కాస్మొటిక్‌ ఛార్జీల కింద ప్రతి నెలా రూ.140 అందజేస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులు, ట్రాక్‌షూట్‌, క్యాజువల్‌ దుస్తులు, తువ్వాలు, బూట్లు, ప్లేట్‌, గ్లాసు, ట్రావెలింగ్‌ బ్యాగు, దుప్పట్లు, పరుపు ఉచితంగా అందిస్తారు. పరీక్ష రుసుం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
విద్యార్థులకు వివిధ శిక్షణలు..
డిగ్రీ తర్వాత వివిధ కోర్సులలో పీజీ, క్యాట్‌, మ్యాట్‌, జామ్‌ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. సివిల్స్‌ ఫౌండేషన్‌, విదేశాలలో ఉన్నత విద్య ప్రవేశం కోసం జీఆర్‌ఈ శిక్షణ, ట్యాలీ శిక్షణ, కేరీర్‌ గైడెన్స్‌ సెల్‌, ఎంప్లాయిబిలిటీ, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ నైపుణ్యాలను మెరుగుపర్చే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. టీజీయూజీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీతో పాటు సైనిక శిక్షణ పొందేందుకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాల భువనగిరిలో ఉంది.
నమోదు ఇలా..
గురుకుల డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఇంటర్‌లో కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అత్యధిక శాతం సీట్లు ఎస్సీలకు కేటాయిస్తారు. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. అర్హత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం
- మందడి నర్సిరెడ్డి, ప్రిన్సిపల్‌, నల్గొండ

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు వరంలాంటివి. గురుకుల కళాశాలల్లో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా కళాశాల విద్యార్థులు గత కొన్నేళ్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మా కళాశాలలో ఇప్పటి వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులు 8మంది, ఓయూలో సీటు పొందిన వారు 71 మంది, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో సీటు పొందిన వారు 14 మంది, బీపీఈడీలో సీటు పొందిన వారు ముగ్గురు ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆడి పతకాలు సాధించారు. విద్యార్థులు గురుకుల కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు