logo

అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తాం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మొత్తం ఆరు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెరాస జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్రకుమార్‌ వెల్లడించారు. తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..

Published : 28 Jan 2022 03:45 IST

తెరాస జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ 

ఈనాడు, నల్గొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మొత్తం ఆరు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెరాస జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్రకుమార్‌ వెల్లడించారు. తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..
  అసంతృప్తులతో మాట్లాడుతా..   నేతలను సమన్వయం చేస్తా
సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలందరినీ సమన్వయం చేస్తాం. అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీకి బలంగా మారేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే సంస్థాగత పదవుల భర్తీ పూర్తయింది. అత్యధిక పదవుల్లో తెరాస నేతలే ఉన్నారు. వారిని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరింత భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పని అయిపోయింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన నాయకులు సైతం మా ప్రభుత్వ విధానాలు నచ్చి తెరాసలో చేరుతారన్న నమ్మకం ఉంది. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా గత ఏడేళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తాం. గత ప్రభుత్వాలు నల్గొండ జిల్లాకు చేసిన అభివృద్ధి, మా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెరాసకు ధీటుగా ఉన్న రాజకీయపార్టీ లేదు. వచ్చే పదేళ్ల పాటూ ఏ ఎన్నికలు జరిగినా గెలుపు తెరాసదే.
ప్రభుత్వ కార్యక్రమాలనూ ప్రజలకు వివరిస్తాం
నల్గొండ జిల్లా లాంటి ప్రాధాన్యం ఉన్న జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనుభవం ఇక్కడ కలిసొచ్చింది. సంస్థాగత నిర్మాణం నాకేమి కొత్త కాదు. ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఐదింటిలో మేమే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులోనూ పార్టీ జెండా ఎగరేస్తాం. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న పార్టీ తెరాసనే. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అవి అన్ని పార్టీల్లోనూ సహజమే. వాటన్నింటినీ చక్కదిద్ది పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా చేర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. త్వరలోనే రెండు మూడు రోజుల్లో దీనిపై పార్టీ మాకు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం మేం ముందుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని