logo

ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభం

దామరచర్ల మండలంలో ఉన్న 14,456 ఎకరాలు, 142 సర్వే నంబర్లు, 92 ఉడాఫా ప్రభుత్వ భూములపై సర్వే చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో బుధవారం కొత్తపల్లి రెవెన్యూ శివారులో సర్వే ప్రారంభించారు. కృష్ణపట్టి గ్రామాలైన

Published : 28 Jan 2022 03:45 IST

మూడు బృందాల ఏర్పాటు

కొత్తపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీవో రోహిత్‌సింగ్‌

దామరచర్ల, న్యూస్‌టుడే : దామరచర్ల మండలంలో ఉన్న 14,456 ఎకరాలు, 142 సర్వే నంబర్లు, 92 ఉడాఫా ప్రభుత్వ భూములపై సర్వే చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో బుధవారం కొత్తపల్లి రెవెన్యూ శివారులో సర్వే ప్రారంభించారు. కృష్ణపట్టి గ్రామాలైన దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో సుమారు 26 వేల ఎకరాలుండగా 90 శాతానికి పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదిక అందించాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో 12 రెవెన్యూ గ్రామాల పరిధిలో 14,456 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. తహసీˆల్దార్‌, డీటీ, ఆర్‌ఐ ముగ్గురు బృందానికి నాయకత్వం వహిస్తారు. ఒక్కో బృందంలో ఇద్దరు సర్వేయర్లు, వీఆర్‌ఏ, ఉంటారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వ భూములను వీరు సర్వే చేస్తారు. ఆయా సర్వే నంబర్లలో భూముల విస్తీర్ణాన్ని కొలిచి తొలుత హద్దులు గుర్తిస్తారు. సాగు దారులను గుర్తించి చుట్టూ కొలత వేస్తారు. రైతును క్షేత్ర స్థాయిలో ఉంచి ఫొటో తీసి సాగు విస్తీర్ణాన్ని నమోదు చేస్తారు. నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తిస్తారు. గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సాగుదారుల వద్ద ఉన్న పట్టా పుస్తకాలు తదితర వివరాలను అధికారులు సేకరిస్తారు. కొత్తపల్లిలో ప్రారంభమైన సర్వేను మిర్యాలగూడ ఆర్డీవో ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ పరిశీలించారు. సర్వేపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహసీˆల్దార్‌ రాజు, ఆర్‌ఐ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని