logo

పంచ్‌ కొడితే పతకాలే..

‘ఆటైనా, వేటైనా నేను దిగనంత వరకు’ అన్న సినిమా డైలాగ్‌ ఈ కళాశాల విద్యార్థులకు అచ్చంగా సరిపోతుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ పతకాల వేట సాగిస్తున్నారు. కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ శిక్షణలో తాము ఇష్టపడిన క్రీడలో పట్టు

Published : 28 Jan 2022 03:45 IST

బాక్సింగ్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్న యువత

బాక్సింగ్‌ శిక్షణలో ఎన్జీ కళాశాల విద్యార్థులు

నల్గొండ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ‘ఆటైనా, వేటైనా నేను దిగనంత వరకు’ అన్న సినిమా డైలాగ్‌ ఈ కళాశాల విద్యార్థులకు అచ్చంగా సరిపోతుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ పతకాల వేట సాగిస్తున్నారు. కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ శిక్షణలో తాము ఇష్టపడిన క్రీడలో పట్టు పెంచుకుంటూ రాటుదేలుతున్నారు. పుస్తకాలకే పరిమితమవుతున్న విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు విఘ్నేశ్‌, విజయ్‌కుమార్‌, శ్రీకాంత్‌. ఈ ముగ్గురు క్రీడాకారులు బాక్సింగ్‌ క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. వీరి విజయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.


బాక్సింగ్‌ అంటే ప్రాణం..
విఘ్నేశ్‌, బీఏ మూడో సంవత్సరం

మాది కట్టంగూర్‌. అమ్మనాన్నలు శ్రీను, లింగమ్మ. బాక్సింగ్‌ అంటే నాకు ప్రాణం. ఓ వైపు క్రీడల్లో రాణిస్తూనే..చదువులో మంచి ఫలితాలు సాధిస్తున్నాను. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఒకసారి, రాష్ట్రస్థాయిలో రెండుసార్లు ఆడి పలు పతకాలు, బహుమతులు సాధించాను. తాజాగా పంజాబ్‌లో జరిగిన అంతర్‌ విశ్వవిద్యాలయాల బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్ని ప్రశంసాపత్రం అందుకున్నాను. ప్రస్తుత సెలవుల్లో సైతం నిత్యం ఇంటి వద్దే ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేస్తున్నాను. భవిష్యత్తులో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.


 అంతర్జాతీయస్థాయిలో రాణించాలని..
శ్రీకాంత్‌, బీకాం, ద్వితీయ సంవత్సరం

మాది నేరేడుగొమ్ము మండలం కచ్చరాజుపల్లి గ్రామం. అమ్మనాన్నలు పద్మ, శ్రీరామ్‌ నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. టీవీల్లో ఎప్పుడు మ్యాచ్‌లు వచ్చినా తప్పక చూసేవాడిని. ఆ మక్కువతో బాక్సింగ్‌లో పదో తరగతి నుంచే శిక్షణ పొందాను. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఒకసారి, రాష్ట్రస్థాయిలో రెండుసార్లు ఆడి పతకాలు, బహుమతులు సాధించాను. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలో నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం పొందాను. ఇక నుంచి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి...భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో ఆడడమే నా ధ్యేయం.


దేశానికి పేరు తేవాలని..
విజయ్‌కుమార్‌, డిగ్రీ మూడో సంవత్సరం

మాది మాడ్గులపల్లి మండలం తొపుచర్ల గ్రామం. అమ్మనాన్నలు దయాకర్‌, ధనమ్మ. నేను పాఠశాలస్థాయి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ పొందాను. స్కూల్‌లెవల్‌ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించాను. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో మూడుసార్లు, రాష్ట్రస్థాయిలో రెండు సార్లు పలు పతకాలు, బహుమతులు సాధించాను. తాజాగా పంజాబ్‌లో జరిగిన అంతర్‌ విశ్వవిద్యాలయాల బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్నాను. నా ఆటను మరింత మెరుగుపర్చుకునేందుకు నిత్యం మా పీడీ మల్లేశ్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయలో రాణించి దేశానికి పేరు తేవాలని ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు