logo

సంక్షిప్త వార్తలు

ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం మండలంలోని కట్టకొమ్ముగూడెం(రామాపురం)లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అమరగాని

Published : 28 Jan 2022 03:45 IST

తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతి

మృతుడు రామనాధం (దాచిన చిత్రం)

చిలుకూరు, న్యూస్‌టుడే : ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం మండలంలోని కట్టకొమ్ముగూడెం(రామాపురం)లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అమరగాని రామనాధం (60) గీత కార్మికుడు. గురువారం తన పొలంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా తాళ్లు అదుపుతప్పి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డి మృతి చెందారు. మృతుని భార్య వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై నాగభూషణరావు తెలిపారు. రామనాధం మృతి పట్ల కల్లు గీతకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. రామనాధానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.


సెలవులకు వచ్చి మృత్యు ఒడికి
   విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి దుర్మరణం

బాణోతు ఏడుకొండలు (పాతచిత్రం)

మఠంపల్లి, న్యూస్‌టుడే: సెలవులకు ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ సైనిక కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాణోతు ఏడుకొండలు (19) ఒమిక్రాన్‌ కారణంగా ప్రకటించిన సెలవులకు ఇటీవల ఇంటికి వచ్చారు. పొలం దగ్గర విద్యుత్తు మోటారును ఆపేందుకు సాయంత్రం పొలానికి వెళ్లిన ఏడుకొండలు స్విచ్‌ను బంద్‌ చేసేక్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలు, చావలి.. కొడుకు మృతదేహాన్ని చూసి విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పేదరికం వెంటాడుతున్నా కొడుకు తమలా కష్టపడకూడదని భావించి ఉన్నత చుదువులు చదివిస్తున్నట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తాడని భావిస్తే..దేవుడు తీరని దుఃఖాన్ని మిగిల్చాడని రోదిస్తూ చెప్పారు.


స్నేహితులతో సరదా.. అంతలోనే విషాదం

ఉపేందర్‌  

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ.. మార్గమధ్యలో ఓ చెరువు ఒడ్డున సరదాగా ఈత కొడుతున్న ఓ విద్యార్థి నీట మునిగి చనిపోయాడు. ఈ విషాద ఘటన చౌటుప్పల్‌ మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బోగి సంగయ్య కుమారుడు ఉపేందర్‌(16) స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తోటి స్నేహితులతో కలిసి సంస్థాన్‌ నారాయణపురం మండలం రాచకొండ పరిధిలోని సరళ మైసమ్మ దేవాలయాన్ని గురువారం దర్శించుకున్నారు. పదో తరగతిలో మంచి మార్కులు రావాలని మొక్కుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి వస్తూ మార్గమధ్యలో ఉన్న నార్లకుంట చెరువు లొకేషన్‌లో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి సరదాగా చెరువులోకి దిగాడు. ఈత రాని ఉపేందర్‌ చెరువు ఒడ్డునే సరదాగా ఈత కొట్టాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. అప్రమత్తమైన స్నేహితులు సమీపంలోని గిరిజనులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపే ఉపేందర్‌ నీటిలో శవమై తేలాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు ఎస్సై యుగేందర్‌ గౌడ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ఆసుపత్రికి తరలించారు.


కుటుంబ తగాదాలతో ఒకరి బలవన్మరణం

సూర్యాపేట నేరవిభాగం: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం తెల్లవారుజామున సూర్యాపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయకాలనీకి చెందిన భీరెడ్డి భాస్కర్‌(35) హైదరాబాద్‌ మన్నెగూడెలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్య లావణ్యతో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపంచెందిన భాస్కర్‌ ఇంట్లోఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

భార్య వేధింపులే కారణం.. తన బలవన్మరణానికి భార్య లావణ్య, అత్త సాధనాల సరిత, మామ శ్రీధర్‌ కారణమంటూ భాస్కర్‌ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. తన పేరిట ఉన్న 200 గజాల స్థలం, అప్పుగా ముగ్గురికి ఇచ్చిన కొంత నగదునూ తన కుమారుడికే చెందాలని అందులో రాశారు. కుమారుడిగా గెలిచాను కానీ.. మంచి భర్తగా గెలవలేకపోయానని.. తన తల్లిని క్షమించమని విజ్ఞప్తి చేశారు.


రసాయనం తాగి మూడేళ్ల చిన్నారి మృత్యువాత

ఆత్మకూరు(ఎం): ఏదీ తాగేదో.. ఏది ప్రాణాలను తీస్తోందో.. తెలిసీతెలియని పసి వయస్సు... అకస్మాత్తుగా గోమార్లను చంపే మందు తాగి మూడేళ్ల చిన్నారి మరణించిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాల్వపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లికి చెందిన ఆవుల అబ్బాస్‌ తన భార్య అఖిల, ఇద్దరు కూతుళ్లు శ్రీవల్లి, నిత్వికతో కలిసి మూడు రోజుల క్రితం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. భార్యాభర్తలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పెద్దకూతురు శ్రీవల్లి ఆడుకుంటూ వెళ్లి పశువుల రక్తం పీల్చే గోమార్లను చంపేందుకు ఉపయోగించే మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లింది. చిన్నారి నోట్లోంచి నురుగు రావడం చూసిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


స్వాతంత్ర సమరయోధుడు కన్నుమూత

వెంకటనారాయణ

నీలగిరి ,న్యూస్‌టుడే:  స్వాతంత్ర సమరయోధుడు న్యాయవాది నల్గొండ పురపాలిక మొదటి ఛైర్మన్‌ తాళ్లపల్లి వెంకటనారాయణ(100)గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 1922లో జన్మించిన వెంకటనారాయణ ఉస్మానియ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశారు. న్యాయవాదిగా పనిచేస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1962లో పురపాలిక సంఘంగా ఏర్పడిన నల్గొండ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రెండో సారి కౌన్సిల్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. న్యాయవాదిగా పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వ్యాపారులు పలువురు నివాళి అర్పించారు.


గజగజ వణికిస్తున్న శీతల గాలులు

సూర్యాపేట పట్టణం: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొద్దిరోజులుగా శీతల గాలులతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.  ఉదయం 11 గంటల వరకు వాతావరణం చల్లగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు, ఆస్థమా వ్యాధిగ్రస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లోల్లోంచి బయటికి రావటానికి జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకే వీధులు బోసిపోయి కనిపిస్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.0, 30.0 డిగ్రీలు గురువారం నమోదయ్యాయి. ఇటీవల జ్వరం, జలుబు బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.


దుర్గ ఆచూకీ దొరికినందుకు ఆనందంగా ఉంది

దామరచర్ల, న్యూస్‌టుడే: 22 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన దుర్గ ఆచూకీ లభించడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆమె మేనమామ సామరబోయిన మారేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కువైట్‌లో ఉంటుండగా బుధవారం అక్కడి నుంచి చరవాణిలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. దుర్గ అదృశ్యం కావడంతో అప్పట్లో దుర్గ తండ్రి తన బావ ఆంజనేయులతో కలసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, చాలా ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అందరు ఉండి దుర్గ 22 ఏళ్లు ఒంటరిగా ఉంటూ అనుభవించిన మానసిక క్షోభ ఎవ్వరకీ రాకూడదన్నారు. దుర్గ కుటుంబ సభ్యులను కలుసుకోవడం ‘ఈనాడు’తో సాధ్యమైందని జీవితాంతం రుణపడి ఉంటామని మారేష్‌ వెల్లడించారు.


చకిలం నాగరాజుకు రాష్ట్రపతి అవార్డు

నల్గొండ నేరవిభాగం: జిల్లా కేంద్రానికి చెందిన చకిలం నాగరాజుకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈయన ప్రస్తుతం కేరళలోని కొచ్చిన్‌లో పోలీస్‌శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2003 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన అగాలి ప్రాంతంలో మొదటి సారి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భార్య హర్షిత 2002 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఎంపికై ఆమె కూడా అదే రాష్ట్రంలో ఐజీగా పనిచేస్తున్నారు.


సర్వర్‌ మొరాయింపుతో నిలిచిన రిజిస్ట్రేషన్లు

అడ్డగూడూరు: ధరణి సర్వర్‌ మొరాయించడంతో అడ్డగూడూరు తహసీల్‌ కార్యాలయంలో గురువారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వచ్చిన వారు సాయంత్రం వరకూ నిరీక్షించారు.18 రిజిస్ట్రేషన్లకు గాను కొందరివి మాత్రమే కావడంతో మిగతా వారు వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని