logo

కొండెక్కిన కోడి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చికెన్‌ ధర దడ పుట్టిస్తోంది. మధ్య తరగతి వారికి చికెన్‌ కొనలేని దుస్థితి నెలకొంది. రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కడంతో వాటికి దూరంగా ఉంటున్నారు.

Published : 19 May 2022 02:49 IST

  రోజురోజుకూ పెరుగుతున్న చికెన్‌ ధరలు

భానుపురి, న్యూస్‌టుడే: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చికెన్‌ ధర దడ పుట్టిస్తోంది. మధ్య తరగతి వారికి చికెన్‌ కొనలేని దుస్థితి నెలకొంది. రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కడంతో వాటికి దూరంగా ఉంటున్నారు. వారం రోజుల్లోనే కిలోకు 60-80 పెరగడంతో వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చికెన్‌ ధర కిలో స్కిన్‌తో 284, స్కిన్‌లెస్‌ రూ.300కు విక్రయిస్తున్నారు. గత పదిరోజుల క్రితం వీటి ధర 200-224గా ఉంది. కోడి ధర కిలో రూ.124 నుంచి 150కు పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఒక రోజు 15 టన్నులు, ఆదివారం, పండగ రోజుల్లో 40 టన్నుల వరకు చికెన్‌ అమ్మకాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చేపలకు డిమాండ్‌.. చికెన్‌ ధర పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో చేపలకు గిరాకీ పెరిగింది. వేసవిలో చెరువుల్లో నీరు అడుగంటడంతో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్ల వెంట విక్రయదారులే కనిపిస్తున్నారు. చెరువుల వద్ద కాకుండా వ్యాపారులు కిలో రూ.150కి విక్రయిస్తున్నారు. కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో విక్రయానికి తెచ్చిన చేపలు

వారంలోనే ధరలు పెరిగాయి
- వంశీ, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు, సూర్యాపేట

వారంలోనే అమాంతంగా ధరలు పెరగగా, మరోవైపు ఎండలు కూడా పెరిగాయి. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదు. జిల్లాకు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి 60 శాతం, తెలంగాణ నుంచి 40 శాతం కోళ్లు తెప్పిస్తుంటాం. రవాణా ఛార్జీలు పెరగడం, కోళ్లు నిల్వలు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వం దృష్టి సారించాలి
- అరుణ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు, సూర్యాపేట

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తాం. రోజుకు 25 కిలో చికెన్‌ తెప్పిస్తాం. ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ కిలో రూ.300 ఉంటే మాకు 25 వరకు తగ్గించి ఇస్తున్నారు. గతంలో రూ.220 వరకు లభించే మాంసం ఇప్పుడు 80కి పైగా అదనంగా పెరిగింది. దీంతో వ్యాపారులకు లాభాలు తగ్గాయి. ప్రభుత్వం ధరల స్థిరీకరణఫై దృష్టిసారిస్తే మేలు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని