logo

సంక్షిప్త వార్తలు

అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రామన్నపేట ఎస్సై ఎం.లక్ష్మయ్య కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి

Published : 19 May 2022 02:49 IST

అప్పుల బాధతో చేనేత కార్మికుడి బలవన్మరణం

రామన్నపేట, న్యూస్‌టుడే: అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రామన్నపేట ఎస్సై ఎం.లక్ష్మయ్య కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన అప్పం రామకృష(34) చేనేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా చేతినిండా పని లేకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. రూ.3లక్షలు అప్పులు కావడంతో వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని వైకుంఠధామంలోని షెడ్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అర్చన బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఎనిమిది, అయిదు సంవత్సరాల ఇద్దరు కుమారులున్నారు.


ట్రాక్టర్‌ ఢీకొని యువకుడు దుర్మరణం

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన తూడి నవీన్‌(25) పెయింటర్‌గా పని చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని ఓ ఇంటికి రంగులు వేసే పని ఒప్పందం చేసుకొని పనులు చేస్తున్నారు. అతనుండే గ్రామం యాదగిరిగుట్టకు దూరం కావడంతో అమ్మమ్మ ఊరైన ఆలేరు శివారు సాయిగూడెం నుంచే కొన్ని రోజులుగా ఆ పనులు చేసేందుకు వచ్చి వెళ్తున్నారు. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై యాదగిరిగుట్టకు బయలుదేరుతున్న క్రమంలో బాహుపేట స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై అపసవ్య దిశలో వస్తున్న ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ప్రమాదంలో నవీన్‌కు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారై పోలీసుల ముందు లొంగిపోయినట్లు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


రహదారి ప్రమాదంలో వృద్ధురాలు..

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్‌ వివరాల ప్రకారం.. చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామానికి చెందిన చొప్పరి ముత్తమ్మ తన బంధువు జంగిని అంజయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెలిమినేడులో ఓ శుభకార్యానికి బయలుదేరారు. పిట్టంపల్లి క్రాస్‌ రోడ్డు వద్దకు వెళ్లగానే అతి వేగంతో నల్గొండ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చొప్పరి ముత్తమ్మ, జంగిలి లింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వీరిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ముత్తమ్మ(65) అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అంజయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


కుళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: ఆత్మకూర్‌ మండల కేంద్రంలోని పీఎస్‌ గార్డెన్స్‌ సమీపంలో బుధవారం ఉదయం కుళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు 45 నుంచి 50ఏళ్ల వయస్సు ఉండి, గోధుమ రంగు చొక్కొ, నల్లటి నైట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే చరవాణి నం. 94407 00067లో సంప్రదించాలని ఎస్సై మధు కోరారు. మృదదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చనిపోయి మూడు రోజులు కావొచ్చని తెలిపారు. ఆత్మకూరు, మోత్కూరు, జనగాం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సీసాలు సేకరించేవారని, మృతుడు అనంతపురం, కర్నూలు, వరంగల్‌, నిజామాబాద్‌ అని వేర్వేరు ప్రాంతాల పేర్లు చెప్పేవారని స్థానికులు తెలిపారు.


అక్కంపల్లి జలాశయంలో..

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: పీఏపల్లి మండలంలో ఏఎమ్మార్పీ అక్కంపల్లి జలాశయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం స్థానిక జాలరులు చేపల వేటకు వెళ్లగా జలాశయం ఒడ్డున శవం కనిపించడంతో అక్కడికి వెళ్లి శవం వివరాలు గుడిపల్లి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వీరబాబు తెలిపారు.


అత్యాచార ఘటనపై గోప్యంగా విచారణ

నకిరేకల్‌, న్యూస్‌టుడే: మండలానికి చెందిన ఒక యువతి(20)పై లైంగిక దాడి ఘటనకు సంబంధించి పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. బాధిత యువతి నల్గొండలో పోలీసు షీ బృందాన్ని ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలతో నకిరేకల్‌ పోలీసులు ఈ ఘటనపై బుధవారం రాత్రి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని