logo

అమాత్యా.. మొర ఆలకించయ్యా..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యసేవలు కొంతమెరుగయ్యాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నిచోట్ల వ్యాధులకు చికిత్సలు చేసేలా వైద్యులు, శస్త్రచికిత్స థియేటర్లు లేవు. ఇక్కడి సమస్యలు

Published : 20 May 2022 02:51 IST

నేడు యాదాద్రి జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటన

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యసేవలు కొంతమెరుగయ్యాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నిచోట్ల వ్యాధులకు చికిత్సలు చేసేలా వైద్యులు, శస్త్రచికిత్స థియేటర్లు లేవు. ఇక్కడి సమస్యలు పరిష్కరించేలా మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకోవలసిన అవసరముంది. శుక్రవారం యాదాద్రి జిల్లాలో మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రాసుపత్రుల పరిస్థితిపై కథనం.

భువనగిరి ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్రాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఆ స్థాయిలో చికిత్సలు, వైద్యసేవలు అందడం లేదు. మౌలిక వసతులు అంతంతమాత్రమే. ఇక్కడ ప్రసూతి కోసం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇతర వ్యాధులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు వైద్యులు, ఆపరేషన్‌ థియేటర్లు లేవు. నలుగురు గైనిక్‌ సర్జన్లకు ఇద్దరు పనిచేస్తున్నారు. జనరల్‌ సర్జన్‌ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. ఆర్థోపెడిక్‌ సర్జన్లు రెండు ఖాళీలు ఉన్నాయి. జిల్లా కేంద్రాసుత్రితో పాటు రామన్నపేట, చౌటుప్పల్‌, ఆలేరు ప్రాంతీయ ఆసుపత్రులలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రసూతి వార్డులో కాన్పుల సమయంలో కింది స్థాయి సిబ్బంది ఒక్కొక్కరి రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చేవారిని పరీక్షల పేరిట ప్రైవేట్‌ కేంద్రాలకు తరలిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బయోమెట్రిక్‌ ఉన్నా వైద్యులు, వైద్యసిబ్బంది ఇప్పటికీ రిజస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. సమయ పాలనకు చర్యలు తీసుకోవాలి. అత్యవసర క్యాజువాలిటీలో రాత్రి వేళల్లో ఒక్కరే వైద్యుడు విధుల్లో ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడినవారిని, ఇతర అనారోగ్య సమస్యలతో అత్యవసరంగా వైద్యసేవలు వచ్చివారికి చికిత్స అందించడంలో ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి వేళలో క్యాజువాలిటీలో ఇద్దరు వైద్యులు విధులల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆలేరులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే కిడ్నీబాధితులకు ఉపశమనం లభిస్తుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులు

జిల్లా కేంద్రంగా 100 పడకలతో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి మంజూరైంది. స్థలం దొరకలేదు. రెండు సంవత్సరాల క్రితమే ఆసుపత్రి నిర్మించేందుకు నిధులు మంజూరైనా అడుగులు పడలేదు. మొన్నటివరకు జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలోని క్వార్టర్స్‌లో డీఎంహెచ్‌వో కార్యాలయం కొనసాగింది. ప్రస్తుతం పాత మున్సిపల్‌ కార్యాలయంలోకి మార్చారు. అన్ని హంగులుతో శాశ్వత డీఎంహెచ్‌వో కార్యాలయం, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోరేజ్‌ సెంటర్‌ నిర్మించాల్సి ఉంది.

ఎస్‌ఎన్‌సీయూ, డీపీఐసీయూ వార్డులు ప్రారంభించనున్న మంత్రి

జిల్లాలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పర్యటించనున్నారు. మొదట బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో నిర్మించనున్న టీఎస్‌ డయాగ్నస్టిక్‌ హబ్‌కు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో చిన్న పిల్లలకు వైద్యసేవలు, చికిత్సలు అందించేందుకు డెడికేటెడ్‌ పిడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌(డీపీఐసీయూ) నవజాత శిశువులకు అనారోగ్య సమస్యలకు చికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలతో అధునాతన స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌(ఎస్‌ఎన్‌సీయూ) వార్డులు ప్రారంభించనున్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖపై కలెక్టర్‌ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో మల్లికార్జునరావు, ఇతర వైద్యాధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.


నల్గొండ ఆసుపత్రిలో..

నల్గొండ అర్బన్‌: నల్గొండ జనరల్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ వార్డులో యంత్రాలు తక్కువగా ఉన్నాయి. పది యంత్రాల ద్వారా సేవలు అందిస్తుండగా మరో అయిదు అవసరమున్నాయి. ప్రత్యే వైద్యనిపుణులు లేకపోవడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. గుండె, నరాల వంటి వైద్యనిపుణులు లేకపోవడంతో చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. 370 మంది నర్సులు సేవలు అందించాలి. కానీ 166 మంది మాత్రమే పనిచేస్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది కొరత ఉంది. ఇక్కడి ఆసుపత్రిలో 550 పడకలు ఉండగా ఇందులో 250 మంది పడకలకు మాత్రమే ఔషధాలు సరఫరా అవుతున్నాయి. దీంతో ఇక్కడికి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మందులు సరఫరా చేయలేని పరిస్థితి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని