logo

దేవరకొండకు డయాలసిస్‌ కేంద్రం మంజూరు

మారుమూల వెనుకబడిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలో ఉపాధి కోసం వలసలు పోవడం, ఆర్థిక లేమితో కన్న పేగును అంగట్లో సరకుగా విక్రయించే దుస్థితి ఇక్కడ నెలకొంది.

Published : 20 May 2022 02:51 IST

దేవరకొండ ప్రభుత్వాసుపత్రి

దేవరకొండ, న్యూస్‌టుడే: మారుమూల వెనుకబడిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలో ఉపాధి కోసం వలసలు పోవడం, ఆర్థిక లేమితో కన్న పేగును అంగట్లో సరకుగా విక్రయించే దుస్థితి ఇక్కడ నెలకొంది. సాధారణ జబ్బు వస్తే నయం చేసుకోవడానికి నానా తంటాలు పడే పరిస్థితి ఇక్కడి ప్రజల్లో నెలకొంది. అలాంటి శరీర భాగాల్లో కిడ్నీలు దెబ్బతింటే వారి పరిస్థితి దయనీయం. దేవరకొండ మారుమూల ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గత నెల 15న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌తో పాటు జిల్లా అధికారులు స్పందించి ఉన్నత వైద్యశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపి మంజూరుకు కృషి చేశారు.

ఫ్లోరిన్‌ నీటితో సమస్యలు అనేకం

దేవరకొండలోని తాగే నీటిలో ఫ్లోరిన్‌ శాతం అధికంగా ఉంటుంది. అంతేగాక ఈ ప్రాంతం గుట్టలతో కూడిన మైనింగ్‌ క్రషర్‌ మిల్లులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా దేవరకొండ డివిజన్‌ పరిధిలోని చందంపేట, డిండి, నేరెడుగొమ్ము, నాంపల్లి, దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరోసిస్‌తో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిన్‌ నీళ్లు తాగడంతో వ్యాధుల బారిన పడిన వారు అధికం. కిడ్నీ బాధితులు, ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్‌కు వెళ్లి వారానికి ఒకసారి డయాలసిస్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహించుకుంటారు. మధ్య తరగతి వారు హైదరాబాద్‌, నల్గొండ వెళ్తూ వారానికి రూ.2,500 చొప్పున నెలకు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పైగా రవాణా భారంతో పాటు ఉన్న ఆరోగ్యం కాస్తా మరింత క్షీణించే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఆస్పత్రులకు డయాలసిస్‌ సెంటర్లను మంజూరు చేశారు. అందులో దేవరకొండ ఏరియా ఆస్పత్రికి ఐదు బెడ్లతో డయాలసిస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ డయాలసిస్‌ సెంటర్‌ ద్వారా చుట్టుపక్కల మండలాల పేద, గిరిజనులు, బలహీన వర్గాలకు కిడ్నీ బారిన పడితే దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్‌ను చేయనున్నారు.


ఒత్తిడి చేసి

-రమావత్‌ రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే

దేవరకొండ గిరిజన ప్రాంతం ఏరియా ఆస్పత్రిలో తప్పనిసరిగా డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు చేయాలని అధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఎట్టి పరిస్థితుల్లో దేవరకొండకు డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ రిజ్వీని కలిశా. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి. వాటిలో దేవరకొండ ఉండటం సంతోషంగా ఉంది.


కిడ్నీ బాధితులకు ఉపశమనం

రాములునాయక్‌, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌

దేవరకొండ ఏరియా ఆస్పత్రికి కిడ్నీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తూ వైద్యశాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేద, మధ్య తరగతికి చెందిన కిడ్నీ బాధితులకు ఈ డయాలసిస్‌ సెంటర్‌ ఎంతో ఉపశమనం కల్గిస్తుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని