logo

అరచేతిలో వివరాలు ప్రత్యక్షం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలకు కేటాయించే నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా మంజూరు చేసే పద్దుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ-గ్రామ స్వరాజ్‌ అనే యాప్‌ దోహదపడుతోంది. ఈ యాప్‌

Updated : 20 May 2022 02:57 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలకు కేటాయించే నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా మంజూరు చేసే పద్దుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ-గ్రామ స్వరాజ్‌ అనే యాప్‌ దోహదపడుతోంది. ఈ యాప్‌ ద్వారా వ్యయాలకు సంబంధించినవి సైతం కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో ఏ సమాచారం కావాలన్నా స.హ.చట్టం ద్వారా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం 2019లో అందుబాటులోకి తీసుకురాగా.. తాజా వివరాలేవీ లభించేవి కాదు. తాజాగా యాప్‌ను అభివృద్ధి చేసి అన్ని వివరాలు పొందుపరిచారు.

పద్దు వివరాలు తెలుసుకునేలా..

ఆధునిక సమాజంలో స్మార్ట్‌ఫోన్‌ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. విద్య, సామాజిక, రాజకీయ తదితర అంశాలను అరచేతిలోని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం సైతం వివిధ రకాల సేవలను ఫోన్‌ ద్వారా అందిస్తూ సేవలను చేరువ చేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకునే అవకాశం దక్కింది. పాలనలో పారదర్శకంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామాల పద్దు వివరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకునే సౌలభ్యం కలిగింది.

పనుల సమాచారం అందుబాటులో..

యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు, పంచాయతీ నిర్వహణ, అభివృద్ధి పనులు, వాటి ఖర్చులు, తదితర వివరాలు తెలుసుకోవచ్ఛు అన్ని భాషల్లోనూ సమాచారం లభ్యమవుతుంది. ఆర్థిక పురోగతి, ఆస్తుల నిర్వహణ, జియో ట్యాగింగ్‌ వంటి వివరాలను సైతం పొందుపరిచారు. ప్రజా ప్రతినిధుల కమిటీలు, సర్పంచి, గ్రామ కార్యదర్శుల వివరాలు, నిధుల మంజూరు, వ్యయం, పనుల పురోగతి వంటివి సైతం కనిపిస్తాయి. వచ్చే ఏడాదికి సంబంధించిన అంచనాలు సైతం చూడొచ్ఛు

డౌన్‌లోడ్‌ ఇలా..

స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ అని టైప్‌ చేయగానే యాప్‌కు సంబంధించిన ఐకాన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం దాన్ని తెరిచి రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఆ గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల వివరాలు, పంచాయతీలో ఆమోదించిన కార్యకలాపాలు, ఆర్థిక పురోగతి వివరాలకు సంబంధించినవి ప్రత్యక్షమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని