logo

అభాగ్యులకు ఆశ్రయమేదీ?

చిట్యాలకు చెందిన రాములు భువనగిరికి పని నిమిత్తం వచ్చారు. పనులు పూర్తవడంతో రాత్రి బస్టాండ్‌కు వెళ్లగా అప్పటికే బస్సు వెళ్లిపోయింది. భువనగిరిలో నిరాశ్రయుల కేంద్రం లేక ఎక్కడికి పోవాలో అర్థం

Published : 20 May 2022 02:51 IST

సూర్యాపేటలోని నిరాశ్రయుల కేంద్రం

* చిట్యాలకు చెందిన రాములు భువనగిరికి పని నిమిత్తం వచ్చారు. పనులు పూర్తవడంతో రాత్రి బస్టాండ్‌కు వెళ్లగా అప్పటికే బస్సు వెళ్లిపోయింది. భువనగిరిలో నిరాశ్రయుల కేంద్రం లేక ఎక్కడికి పోవాలో అర్థం కాక బస్టాండ్‌లోనే రాత్రంతా ఉండాల్సి వచ్చింది.

* మిర్యాలగూడలో వెంకటయ్య భిక్షాటన చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వృద్ధుడు కావడంతో పట్టణంలో దూరంగా ఉన్న కేంద్రం తెలియదు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక ఫ్లైఓవర్‌ కింద నిద్రపోతున్నారు. కేంద్రాన్ని దగ్గరలో ఏర్పాటు చేస్తే ఇలాంటి వారికి ఉపయోగంగా ఉండేది.

సూర్యాపేట పురపాలిక, మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో నిరాశ్రయుల కేంద్రాలు సూర్యాపేట మినహా ఎక్కడ నిర్వహించడం లేదు. ఊరు నుంచి వచ్చి అనాథగా మారి రోడ్ల వెంబడి భిక్షాటన చేసుకొనే వారికి ఈ కేంద్రాలు ఆసరాగా ఉంటాయి. పొద్దంతా పనులు చేసుకొని రాత్రి వేళలో ఆశ్రయం పొందేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం చూపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 19 పురపాలికలు ఉండగా సూర్యాపేటలోనే నిర్వహిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నిరాశ్రయులు బస్టాండ్లు, రోడ్ల వెంట తలదాచుకుంటున్నారు.

సూర్యాపేటలో పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఓ కమ్యూనిటీ భవనంలో చేపడుతున్నారు. విశాలమైన భవనం, పార్కుతో కూడిన మైదానంలో నిర్వహణ సాగుతోంది. రాత్రి వేళలో కూడళ్లు, బస్టాండ్లలో నిద్రించకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. దేవరకొండ, చౌటుప్పల్‌, హాలియా, నేరేడుచర్ల, తిరుమలగిరి, కోదాడ, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి, చిట్యాల, యాదగిరిగుట్ట, చండూరు, చిట్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, నందికొండ పురపాలికలో ఎక్కడ నిరాశ్రయుల కేంద్రాలు లేవు. మిర్యాలగూడలో బస్టాండ్‌కు దూరంగా ఉండటంతో ఎక్కువగా ఎవరూ వినియోగించుకోవడం లేదు. భువనగిరిలో నిర్మాణం పూర్తయినా నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. నల్గొండలో కేంద్రం ఉన్నా రెండేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. నిర్వాహకులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో నిరాశ్రయులకు ప్రయోజనం లభించడం లేదు.

సొంత భవనం లేక దూరంగా ఏర్పాటు

- రవీందర్‌సాగర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, మిర్యాలగూడ

నిరాశ్రయుల వసతి కేంద్రం మిర్యాలగూడలో చాలారోజుల క్రితం ఎంపిక చేశారు. ప్రభుత్వ భవనం ప్రకాశ్‌నగర్‌లో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాల్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌కు దూరంగా ఉన్న మాట వాస్తవమే. పట్టణం మధ్యలో సొంత భవనాలు లేకపోవడంంతో సమస్య ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని