logo

నల్గొండ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి: పవన్‌ కల్యాణ్‌

ఉద్యమ గడ్డ నల్గొండ జిల్లా ఇచ్చిన స్ఫూర్తితోనే 2008లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌, కోదాడలో ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో నల్గొండ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కరించాలని అనుకున్నానని.. అప్పుడు స్థానిక రాజకీయాలతో కొందరు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మంచి పనులు చేయాలంటే...

Published : 21 May 2022 02:43 IST

కోదాడ: మృతుడి తల్లి కడియం లక్ష్మమ్మకు బీమా చెక్కు అందజేస్తున్న పవన్‌ కల్యాణ్‌

కోదాడ, కోదాడ పట్టణం, చౌటుప్పల్‌ గ్రామీణం- న్యూస్‌టుడే: ఉద్యమ గడ్డ నల్గొండ జిల్లా ఇచ్చిన స్ఫూర్తితోనే 2008లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌, కోదాడలో ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో నల్గొండ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కరించాలని అనుకున్నానని.. అప్పుడు స్థానిక రాజకీయాలతో కొందరు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మంచి పనులు చేయాలంటే స్వచ్ఛంద సంస్థ సరిపోదని రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అనిపించిందని చెప్పారు. తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

బీమా చెక్కుల అందజేత...
హుజూర్‌నగర్‌ మండలం మర్రిగూడకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త కడియం శ్రీనివాస్‌ గతేడాది ఆగస్టు 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీ అందించిన ప్రమాద బీమా ద్వారా రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో నివసిస్తున్నారు. బీమా చెక్కు ను అందించేందుకు ఆయన శుక్రవారం కోదాడకు వచ్చారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబ సభ్యులను చౌటుప్పల్‌ మండలం లక్కారంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి బీమా చెక్కు అందజేశారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతీయ రహదారి నుంచి కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. అభిమానులు క్రేన్‌ సాయంతో గజమాలతో స్వాగతం పలికారు. తొలుత బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి చెక్కు అందించాలని భావించినా జనం అధికంగా ఉండటంతో ఆయన వాహనం దిగడం మంచిది కాదని పోలీసులు చెప్పటంతో బాధిత కుటుంబానికి ఆయన వద్దకే తీసుకువచ్చారు. మృతుడి తల్లి కడియం లక్ష్మమ్మ, కుటుంబ సభ్యులకు కారు వద్దనే చెక్కును అందజేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎక్కువ సమయం బాధిత కుటుంబంతో మాట్లాడే వీలులేకపోయింది. పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మేకల సతీశ్‌రెడ్డి, నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.సురేశ్‌, సైదులు పాల్గొన్నారు.

జనసంద్రంగా కోదాడ రంగా థియేటర్‌ సెంటర్‌

స్వల్ప అపశ్రుతి...
పవన్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని కొమరబండ సమీపంలోకి పవన్‌ కాన్వాయ్‌ ప్రవేశిస్తుండగా ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడి రహదారిపైకి వచ్చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కొంతమంది కింద పడిపోగా ఆయన కాన్వాయ్‌లోని ఓ వాహనం వారిపై నుంచి వెళ్లింది. మరి కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. మండలంలోని కూచిపుడి గ్రామానికి చెందిన నాయబ్‌ రసూల్‌ అనే అభిమాని నడుము మీద నుంచి కారు వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడిని మొదటగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన చెన్నకేశవరావు, మరో మహిళ సైతం గాయపడ్డారు. అభిమానులను కంట్రోల్‌ చేసే క్రమంలో కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. దేవరకొండకు చెందిన అభిమానికి కూడా గాయాలైనట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని