logo

ఉద్యానం..అధ్వానం

పట్టణాలు కాంక్రీట్‌ అరణ్యాలుగా మారుతున్నాయి. పార్కుల నిర్వహణ అధ్వానంగా తయారవడంతో ప్రజలకు ఆహ్లాదం కరవవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో 350కిపైగా పార్కు స్థలాలున్నాయి. అందులో అమృత్‌ పట్టణాలైన నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో కాస్త పార్కుల సుందరీకణ పనులు చేపట్టారు. కానీ వాటి నిర్వహణ సక్రమంగా లేదు. ఇక కొత్త పురపాలికల్లో పార్కులను  అభివృద్ధి చేయడంలో పాలకవర్గాలు, పుర

Published : 22 May 2022 04:48 IST

నిరాదరణకు గురైన చౌటుప్పల్‌లోని పైలాన్‌ పార్కు

పట్టణాలు కాంక్రీట్‌ అరణ్యాలుగా మారుతున్నాయి. పార్కుల నిర్వహణ అధ్వానంగా తయారవడంతో ప్రజలకు ఆహ్లాదం కరవవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో 350కిపైగా పార్కు స్థలాలున్నాయి. అందులో అమృత్‌ పట్టణాలైన నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో కాస్త పార్కుల సుందరీకణ పనులు చేపట్టారు. కానీ వాటి నిర్వహణ సక్రమంగా లేదు. ఇక కొత్త పురపాలికల్లో పార్కులను  అభివృద్ధి చేయడంలో పాలకవర్గాలు, పుర అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు సేద తీరేందుకు వారాంతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఒక్క నల్గొండ పట్టణంలో మాత్రమే కొత్తగా పార్కులు సుందరీకరిస్తున్నారు. చండూరులో కొత్తగా మూడు పార్కులను అభివృద్ధి పర్చినా ప్రారంభించడం లేదు. సూర్యాపేట పట్టణంలో ఉద్యానాలు అధ్వానంగానే ఉన్నాయి.

ఆలేరు: యాదగిరిగుట్టలో పార్కుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఏర్పాటుకు ఇంకా ముందడుగు పడలేదు. కొత్తగా ఏర్పడిన మోత్కూర్‌, హాలియా, తిరుమలగిరి, ఆలేరు, భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు కాలేదు. నేరేడుచర్లలో పార్కు పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌ పురపాలిక కేంద్రంలోని గాంధీ పార్కు పేరుకే పరిమితమైంది. దాని స్థలం కబ్జాకు గురైంది. పార్కులో పచ్చదనం మచ్చుకైనా లేదు. వాహనాల పార్కింగ్‌ స్థలంగా మారింది.

* మిషన్‌ భగీరథ పైలాన్‌ చుట్టూ పార్కు 2015లో ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో తాళం పడింది.


నీలగిరిలో సాగుతున్న పనులు

నల్గొండ: సుందరీకరణలో రాంనగర్‌ పార్కు

నల్గొండ పురపాలిక: నల్గొండ పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందించేలా పుర యంత్రాంగం పలు పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పట్టణ సుందరీకరణలో భాగంగా మూడు పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అమృత్‌ పథకం ద్వారా రాంనగర్‌, రాజీవ్‌ పార్కుతోపాటు మరో ఏడు పార్కుల్లో సుందరీకరణ పనులు చేపట్టారు. వాటికి తోడు పట్టణ ప్రగతి నిధుల ద్వారా చర్లపల్లిలో అర్బన్‌ పార్కును కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. నీలగిరి నడిబొడ్డున ఉన్న రాజీవ్‌పార్కు కొత్త కళ సంతరించుకొంది. అమృత్‌ పథకం ద్వారా రూ.75 లక్షలు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా రూ.50 లక్షలతో సుందరీకణ పనులు కొనసాగుతున్నాయి. రాంనగర్‌ పార్కులో సుమారు రూ.1.5 కోట్లతో ఫౌంటెన్‌, బోటింగ్‌ వంటి సౌకర్యాలతో సందర్శకులను ఆకర్షించేలా పనులు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఓపెన్‌ జిమ్‌లు, ఆట పరికరాలు సమకూర్చారు. ఇప్పటికే రాంనగర్‌ పార్కుకు నిత్యం 200కు పైగా సందర్శకులు వస్తున్నారు. సందర్శన రుసుం పేరుతో మున్సిపాలిటీకి సైతం ఆదాయం లభిస్తోంది. పార్కుల సుందరీకరణ పూర్తయితే సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.  


సౌకర్యాలు కరవు

సూర్యాపేటలో ప్రహరీకి నోచుకోని రాజీవ్‌గాంధీ పార్కు

సూర్యాపేట పురపాలిక: జిల్లా కేంద్రంలో పార్కుల నిర్వహణ అధ్వానంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు లేవు. చిన్నారులు ఆడుకొనేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేయలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 పార్కులు ఉన్నాయి. ఇందిరా పార్కులో మరుగుదొడ్లు ఉన్నా వాటికి తాళం వేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్‌నగర్‌లోని పార్కులో ఎలాంటి మొక్కలు పెంచలేదు. రాజీవ్‌ గాంధీ పార్కు ప్రహరీ లేక అధ్వానంగా మారింది. చెత్తాచెదారంతో నిండిపోయింది. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. పార్కుల్లో వసతులు కల్పించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోతున్నారు.

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ పురపాలికలో ఉన్న ఆరు పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉపయోగపడటం లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని