logo

వక్ఫ్‌ బోర్డు భూముల ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ

ముస్లింల ప్రార్థన మందిరాలు, దర్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన వేలాది ఎకరాల భూములను ముజావర్లు, ముతవలీలుగా చెలామణి అవుతూ  అక్రమ మార్గంలో కాజేసిన విషయమై ‘ఈనాడు’ కొంత కాలంగా ఇస్తున్న

Published : 22 May 2022 04:40 IST

ఆక్రమణదారులంతా ఏకం..
బయట పడేందుకు యత్నాలు
‘ఈనాడు’ వరుస కథనాలకు స్పందన

నల్గొండ పట్టణంలోని లతీఫ్‌ సాబ్‌ దర్గా భూములు పరిశీలిస్తున్న సీబీసీఐడీ అధికారులు బృందం

నీలగిరి, న్యూస్‌టుడే: ముస్లింల ప్రార్థన మందిరాలు, దర్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన వేలాది ఎకరాల భూములను ముజావర్లు, ముతవలీలుగా చెలామణి అవుతూ  అక్రమ మార్గంలో కాజేసిన విషయమై ‘ఈనాడు’ కొంత కాలంగా ఇస్తున్న వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆక్రమణ లెక్కలు తేల్చే బాధ్యత సీబీసీఐడీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గెజిట్‌లో ఉన్న రికార్డుల ప్రకారం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. నల్గొండ వక్ఫ్‌ బోర్డు అధికారుల వద్ద భూముల వివరాలు తీసుకుని అత్యధికంగా ఆక్రమణలకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ‘ఈనాడు’ కథనాలకు స్పందించి ఇప్పటి వరకు వక్ఫ్‌ బోర్డు అధికారులు సర్వేలు చేయించిన వివరాలను సీబీసీఐడీ అధికారులకు అప్పగించారు.

అధికార పార్టీ నాయకులతో  మంతనాలు

సీబీసీఐడీ రంగంలోకి దిగడంతో ఆక్రమణలకు సంబంధం ఉన్న వారు, భూములు తమవేనని అమ్ముకున్న వారు అధికార పార్టీ ముఖ్య నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. విచారణ పక్కదారి పట్టించి తమపైకి కేసులు రాకుండా చూసుకోవడానికి రాజకీయ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

నల్గొండ, దేవరకొండలోనే అధికం

దర్గాలు, ఈద్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ, సమాధులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వక్ఫ్‌ బోర్డు గెజిట్‌ ప్రకారం 5 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అందులో అయధికంగా ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. వక్ఫ్‌ బోర్డు భూమి సాగుచేస్తున్న వారు ఎక్కడా రూపాయి కౌలు చెల్లించడంలేదు. ముతవలీలు, ఇనాందారులమంటూ భూములు ఆక్రమించి అమ్ముకున్నారు. నల్గొండ పట్టణంలోని లతీఫ్‌ ఉల్లా షా ఖాద్రీ దర్గాకు చెందిన వ్యవసాయ భూమి, దర్గా సమీపంలోని 50 ఎకరాలను ఆక్రమించారని అధికారులు గుర్తించి 400 మందికి నోటీసులు ఇచ్చారు. దర్గా భూమి సర్వేనంబర్లను గ్రామ కంఠం భూమిగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దర్గా భూములు తమవేనని అమ్ముకుని పత్రాలు రాసి ఇచ్చిన వారిపై 2016లో నల్గొండ వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దేవరకొండలో ఆక్రమించిన వారికి అధికారులు నోటీసులు ఇచ్చినా వక్ఫ్‌ భూముల్లో నిర్మాణాలు ఆగడం లేదు. 

కబ్జాదారుల్లో పోలీసులే అధికం!

నల్గొండ పట్టణంలోని దర్గా, మజీద్‌ భూములు ఆక్రమించుకున్న వారిలో పోలీసులు అధికంగా ఉన్నారని ప్రచారం ఉంది. వారికి తోడు గతంలో అధికారంలో ఉన్నవారు ప్రస్తుతం అధికార పార్టీలోకి మారి తమ ఆక్రమాలను కొనసాగిస్తున్నారు. పట్టణంలోని ఓ మజీద్‌ను కమిటీ పేరుతో ఆక్రమించి ఆస్తులను అనుభవిస్తూ వక్ఫ్‌ బోర్డును పట్టించుకోవడంలేదని ప్రచారం ఉంది. ఈ విషయమై అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. లతీఫ్‌సాబ్‌ దర్గా భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ముతవలీల పేరుతో భూములు అమ్ముతున్నారని పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇటీవల వక్ఫ్‌ బోర్డు, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడానికి వెళ్లగా ఆక్రమణదారులు దాడికి ప్రయత్నించారని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రికార్డులు అప్పగించాం... వక్ఫ్‌ బోర్డు అధికారి మహ్మద్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వక్ఫ్‌ బోర్డు భూముల ఆక్రమణలను తేల్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఆక్రమణల వివరాలు, భూముల రికార్డులు, రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే చేసిన నివేదికలను సీబీసీఐడీకి అప్పగించాం. వారి విచారణకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నాం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని