logo

కుటుంబ కలహాలతో భార్యను కడతేర్చిన భర్త

కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త కడతేర్చిన సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నేదునూరుకు చెందిన పొందుర్తి నాగరాజుకు యాదగిరిగుట్టకు చెందిన

Published : 22 May 2022 04:40 IST

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త కడతేర్చిన సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నేదునూరుకు చెందిన పొందుర్తి నాగరాజుకు యాదగిరిగుట్టకు చెందిన నీరజ(35)తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు శ్రీహర్ష(11), కూతురు నిహారిక(8) సంతానం. నాగరాజు స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూనే డ్రైవర్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా నీరజ వ్యవసాయ పనులను చూసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. వీరి కాపురంలో రెండు నెలలుగా కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. ఇటీవల వారిరువురి కుటుంబాల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. శనివారం ఉదయం పొలం పనులకు నీరజ వెళ్లగా, మధ్యాహ్నం నాగరాజు వెళ్లాడు. అక్కడ ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశానికి గురైన నాగరాజు నీరజపై కర్రతో దాడి చేయగా తలకు తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌ రెడ్డి తెలిపారు. నీరజ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

బీబీనగర్‌, న్యూస్‌టుడే: మండలంలోని జమీలపేట్‌ శ్మశాన వాటిక సమీపంలోని నీటి సంపులో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన వీఆర్‌ఏ యాదయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయస్సు సుమారు 35-45 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్సై సైదులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 95647 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

పెద్దఅడిశర్లపల్లి: పీఏపల్లి మండలం ఏఎమ్మాఆర్‌ ప్రాజెక్టు ప్రధాన కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు లభ్యం కాలేదని గుడిపల్లి ఎస్సై పి.వీరబాబు తెలిపారు. మృతుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అయి ఉంటారని, ఇక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నామని ఎస్సై వెల్లడించారు. మృతదేహానికి పలుచోట్ల గాయాలుండడంతో మృతుడు కాలుజారి కాల్వలో పడి ఉండొచ్చన్నారు. శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


ద్విచక్ర వాహన చోరుల అరెస్టు

అమ్రాబాద్‌: నాగర్‌కర్నూలు, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి 27 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్‌ అమ్రాబాద్‌లో విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఎలిశెట్టి సత్యనారాయణ, చారగొండ మహేశ్‌ వివిధ జిల్లాల నుంచి ద్విచక్రవాహనాలు దొంగిలించి విక్రయించేవారు. 20న అమ్రాబాద్‌ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా సత్యనారాయణ, మహేశ్‌ పట్టుబడ్డారు. వారిని విచారించగా వివిధ ప్రాంతాల్లో 44 ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకొన్నారు. అందులో నల్గొండ జిల్లావే 18 వాహనాలు ఉన్నాయి. నిందితులను రిమాండ్‌కు పంపించారు.


కుక్కల దాడిలో జింక మృతి

తుర్కపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని గంధమల్ల గ్రామంలో శనివారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేయటంతో జింక పిల్ల మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపురం అడవుల్లోంచి నాలుగు జింకలు గ్రామ శివారులోకి వచ్చాయి. శునకాలను వాటిని చూసి దాడికి దిగాయి. జింక పిల్లను పట్టుకుని గొంతును కొరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా మూడు జింకలు భయంతో అడవిలోకి వెళ్లిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌, బీట్‌ అధికారి రాజశేఖర్‌ మరణించిన జింక పిల్లను పరిశీలించారు. కుక్కలు దాడి చేయటంతోనే జింక మృతి చెందినట్లు డీఆర్వో తెలిపారు.


రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

నకిరేకల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నకిరేకల్‌ బైపాస్‌లో శనివారం తెల్లవారుజామున ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళుతున్న బర్కత్‌పుర డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు నకిరేకల్‌ వద్ద హైవే బైపాస్‌ రహదారిపై తెల్లవారుజామున అదుపుతప్పి కల్వర్టు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన కొండల్‌రావు(43), జి.ఇందు(37), ఏ.శ్రీను(52), టి.ఉదయరాణి(40)తో పాటు మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక 108 అంబులెన్సులో నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి పంపించారు. ప్రమాదం జరిగినపుడు బస్సులు 40 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నకిరేకల్‌ సీఐ ఎ.వెంకటయ్య తెలిపారు.


పోలీసుల అదుపులో నిందితులు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌ డాక్టర్స్‌ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లలో ఇటీవల జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతానికే చెందిన నలుగురు బాలురు ఈ ఘటనలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారి అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు గతంలో కూడా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని