logo

రహదారి ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని రావులపెంట గ్రామంలో బీమారం సూర్యాపేట రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.

Published : 24 May 2022 03:51 IST

రోడ్డు దాటుతుండగా..


చిట్యాల జానయ్య

వేములపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని రావులపెంట గ్రామంలో బీమారం సూర్యాపేట రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావులపెంటకు చెందిన చిట్యాల జానయ్య(37) క్షౌరదుకాణాన్ని ఉదయం 5గంటలకు తెరచి శుభ్రంగా ఊడ్చుకుని చెత్తను తీసుకెళ్లి రహదారికి ఎదురుగా ఉన్న పెంటకుప్పలో పారవేసేందుకు వెళ్లారన్నారు. చెత్తను పారవేసి రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని కారు జానయ్యను ఢీకొట్టడంతో ఎగిరి పక్కన ఉన్న పెంటకుప్పలో పడిపోయారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో వేములపల్లి శివారులో మృతిచెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నర్సింహారావు పేర్కొన్నారు.

విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొని..

యాదగిరిగుట్ట పట్టణం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి పక్కన విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం మాసాయిపేటలో చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట ఎస్సై శేఖర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బొల్లారం మహేందర్‌ (45) కొన్నాళ్ల క్రితం యాదగిరిగుట్టకు వలస వచ్చి స్థానిక రైస్‌ మిల్లులో పని చేస్తున్నారు. తన అత్తగారి గ్రామమైన నమిలెలో దుర్గమ్మ పండగకు శనివారం కుటుంబ సభ్యులతో వెళ్లి, సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఒక్కడే తిరుగు ప్రయాణమయ్యారు. మాసాయిపేట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో మహేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే మహేందర్‌ మృతి చెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య యాదగిరిగుట్ట పురపాలికలో అవుట్‌ సోర్సింగ్‌పై స్వీపర్‌గా పని చేస్తుంది. ఇటీవల సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం చేపట్టిన ఇంటి నిర్మాణం తుది దశకు చేరింది. గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడం తీరని విషాదం నింపింది.


కొరివి సోమన్న

ట్రాక్టర్‌ ప్రమాదంలో ఇద్దరు..

నాగారం: ట్రాక్టర్‌ పైనుంచి పడి చోదకుడు మృతి చెందిన ఘటన ఈటూరులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరివి సోమన్న (25) తన పొలంలో చెరువు మట్టి పోసేందుకు ట్రాక్టర్‌ నడుపుతూ అకస్మాత్తుగా వాహనం పైనుంచి జారిపడ్డారు. మడ్గర్‌ రేకు లేకపోవడంతో టైర్ల కింద పడిపోయారు. వాహనం టైర్లు సోమన్న శరీరం పైనుంచి వెళ్లాయి. స్థానికులు గమనించి అతడిని సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.


అశోక్‌

శాలిగౌరారం: ట్రాక్టర్‌ ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన అడ్లూరులో సోమవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరుకు చెందిన దేవనబోయిన అశోక్‌(28) అడ్లూరు నుంచి ట్రాక్టర్‌లో మట్టిని తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ నడుపుతున్న అశోక్‌ వేగంగా వచ్చి రోడ్డుపై ఉన్న రాయిపై ఎక్కించడంతో వాహనం అదుపు తప్పింది. దీంతో అశోక్‌ ఎగిరి అదే ట్రాక్టర్‌ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అశోక్‌ మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని